తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ చావును రేవంత్ పదే పదే కోరుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అయితే, బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లలో కేసీఆర్ మీద రేవంత్ విమర్శలు...తాజాగా అసెంబ్లీలోనూ కంటిన్యూ అవుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై, తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై తన చిత్తశుద్ధిని శంకిస్తే తోలు తీయడమే కాదు..నాలుక కోస్తాం అంటూ రేవంత్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఇక, ఉర్దూలో ఉస్ భడ్వేకు కౌన్ సమ్ ఝాయేగా అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెబుతున్నట్లుగా రేవంత్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. రేవంత్ కామెంట్లకు ఒవైసీ నవ్వుతున్న వీడియో కూడా వైరల్ అయింది. దీంతో, సభాధ్యక్షుడి హోదాలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవమైన శాసన సభలో ఈ విధమైన భాషను మాట్లాడడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తాను సీఎం అని రేవంత్ మరచిపోయినట్లున్నారని, అందుకే ఈ రకంగా నోరుజారుతున్నారని రేవంత్ ను ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం కొత్త కాదని, కానీ, సభలో కూడా ఈ తరహాలో దూషణలకు దిగడం మంచి సాంప్రదాయం కాదని అంటున్నారు.
అంతకుముందు సభలో అక్బరుద్దీన్ ఒవైసీ కూడా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తాను వస్తున్నానని, తాను మాట్లాడతానని, తోలు తీస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ప్రతిపక్ష నేత పత్తా లేకుండా పోయాడంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు రావడం లేదని ఒవైసీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ రేవంత్ ...ఆ రకంగా కేసీఆర్ పై విమర్శలు చేశారు.