ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఏపీలో పెట్టుబడుల కోసం వేట కొనసాగిస్తూనే..మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులనూ పర్యవేక్షిస్తున్నారు. ఆ కోవలోనే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే భోగాపురంలో తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురానికి వచ్చిన ప్రత్యేక విమానం రన్ వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది.
ఎయిర్ ఇండియాకు చెందిన ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ కలిశెట్టి, పలువురు అధికారులు, జీఎంఆర్ ఉన్నతాధికారులు ఉన్నారు. కొత్త రన్‌వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్ తో విమానాశ్రయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
శర వేగంగా పనులు పూర్తి చేసి గడువు కంటే ముందే వ్యాలిడేషన్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించడం కూటమి ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనమని ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు మొదలైతే విశాఖ పారిశ్రామికంగా, విజయనగరం పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు.