రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ పథకం పనులు ఆపితేనే తాను ఏ విషయంపై అయినా చర్చలకు వస్తానని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని తేల్చి చెప్పానని అన్నారు. తన మీద గౌరవంతోనే చంద్రబాబు ఆ ప్రాజెక్టు పనులు ఆపేశారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆయుధంగా మారాయి.
తన శిష్యుడుf రేవంత్ రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జలాల పంపకాల వ్యవహారంలో చెలరేగిన వివాదంపై సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు. త్వరలోనే ఆ విషయంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు.
వాస్తవానికి చంద్రబాబు, రేవంత్ ల మధ్య క్లోజ్డ్ రూమ్ లో జరిగిన సంభాషణను రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టారు. దీంతో, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తనతోపాటు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని బీఆర్ఎస్ నేతలు శంకించడంతో రేవంత్ సభలో చంద్రబాబుతో జరిగిన సంభాషణను బయటపెట్టారు. దీంతో, ఆ విషయంపై వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. దీంతో, అసలేం జరిగింది అన్న విషయాన్ని చంద్రబాబు వెల్లడించే అవకాశముంది.