సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌లో పెద్ద పండుగ. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టేందుకు బడా హీరోలందరూ క్యూ కడుతుంటారు. కానీ, ఈ ఏడాది సంక్రాంతి రేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ జనవరి 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో సీన్ మరోలా ఉంది. సొంత గడ్డపైనే రాజా సాబ్‌కు థియేటర్ల సెగ తగులుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నాయగన్) కూడా అదే రోజు విడుదలవుతోంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని కీలకమైన సింగిల్ స్క్రీన్లతో పాటు ప్రధాన ఏరియాల్లో ‘జన నాయకుడు’కు భారీగా థియేటర్లు కేటాయిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.
అటు మల్టీప్లెక్స్‌ల దగ్గరా రాజా సాబ్‌కు ఎదురు దెబ్బే తగిలేలా ఉంది. ఎందుకంటే జన నాయకుడు సినిమా పంపిణీ బాధ్యతలను మల్టీప్లెక్స్ దిగ్గజం PVR INOX తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లోని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో మెజారిటీ షోలను జన నాయకుడుకే కేటాయించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ సినిమాకు కనీసం సొంత అడ్డాలో కూడా గౌరవం దక్కకపోవడం ఏంటని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
మరోవైపు, తమిళనాడులో లోకల్ హీరోల సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల ‘రాజా సాబ్’కు అక్కడ సరైన స్క్రీన్లు దక్కే పరిస్థితి లేదని సమాచారం. దీంతో ``మన హీరో సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమైతే, పక్క రాష్ట్రం హీరో సినిమాకు ఇక్కడ రెడ్ కార్పెట్ వేయడం ఏంటి?`` అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లోకల్ సినిమాలే రాజ్యమేలుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డబ్బింగ్ సినిమాలకు పెద్ద పీట వేయడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు.