అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. సికింద్రాబాద్ మూలాలున్న 27 ఏళ్ల నికిత గోడిశాల అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ప్రవాస భారతీయుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆమె మాజీ స్నేహితుడు అర్జున్ శర్మ ఆడిన డ్రామా వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే.
డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల అనంతరం నికిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ స్వయంగా పోలీసులను ఆశ్రయించాడు. ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమెను చివరిసారిగా చూశానని, ఆ తర్వాత ఆచూకీ తెలియడం లేదని నమ్మబలికాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో ఆమె కోసం వెతుకుతున్నట్లు నటించాడు.
నికిత ఆచూకీ కోసం స్నేహితులు ఆందోళన చెందుతున్న తరుణంలో, పోలీసులకు అర్జున్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. సెర్చ్ వారెంట్‌తో కొలంబియాలోని అర్జున్ అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయగా, అక్కడ నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలోనే అర్జున్ ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను మరుగుపరిచి, పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన అర్జున్ శర్మ.. కేసు తన చుట్టూ తిరుగుతోందని గ్రహించి తెలివిగా తప్పించుకున్నాడు. జనవరి 2వ తేదీనే అతడు అమెరికా విడిచి భారత్‌కు పారిపోయినట్లు విమానాశ్రయ రికార్డుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం నిందితుడు అర్జున్ శర్మ కోసం అమెరికా ఫెడరల్ అధికారులు గాలిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు భారత ప్రభుత్వ అధికారుల సహకారం కూడా కోరినట్లు సమాచారం. కాగా, నికిత మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న కూతురు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.