ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. కానీ, ఒక ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకుని, తీరా అది పూర్తయ్యే దశకు వచ్చేసరికి.. "ఇది నా వల్లే జరిగింది" అని డబ్బా కొట్టుకోవడం మాత్రం వైసీపీకే చెల్లింది. ఉత్తరాంధ్ర తలరాతను మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే సగటు మనిషి కూడా ముక్కున వేలేసుకుంటున్నాడు.
2014లో చంద్రబాబు నాయుడు విజన్ తో భోగాపురం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. భూసేకరణ ప్రక్రియ మొదలుపెడితే.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ``విశాఖలో ఎయిర్‌పోర్ట్ ఉండగా.. ఇక్కడ ఇంకోటి ఎందుకు? రైతుల పొలాలు లాక్కుంటున్నారు.. నేనొస్తే రద్దు చేస్తా`` అంటూ రెచ్చగొట్టారు. నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సాక్ష్యాలుగా తిరుగుతున్నాయి.
2019లో అధికారంలోకి వచ్చాక జగన్ తన మార్క్ పాలిట్రిక్స్ ప్రదర్శించారు. ఏ ప్రాజెక్టునైతే అడ్డుకున్నారో, దానికే మళ్లీ శంకుస్థాపన చేసి కాలక్షేపం చేశారు. జగన్ ఐదేళ్ల పాలన ముగిసే సమయానికి అక్కడ జరిగింది కేవలం 26 శాతం పనులు మాత్రమే. అంటే, విమానాశ్రయాన్ని పూర్తి చేయాలనే సంకల్పం కంటే, దాన్ని సాగదీయాలనే ఆలోచనే ఎక్కువగా కనిపించింది.
కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల కాలంలోనే 75 శాతం పనులు పూర్తి చేయడం ఒక రికార్డ్. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో భోగాపురం రూపురేఖలు మారిపోయాయి. రన్-వే సిద్ధమైంది, టెర్మినల్ భవనాలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం తొలి విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతుండటంతో జగన్ రెడ్డిలో టెన్షన్ మొదలైంది.
విమానాశ్రయం పూర్తవుతోందని తెలియగానే జగన్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వదిలారు. దాని సారాంశం ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్ అంతా నా వల్లే జరిగింది అని. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సినిమా షూటింగ్ మొత్తం ఒకరు చేస్తే.. థియేటర్ దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి జగన్ వస్తున్నారా? అని సెటైర్లు వేస్తున్నారు. పని బాబుది.. బిల్డప్ జగన్‌ది అంటూ ట్రోల్ చేస్తున్నారు.