టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక ఎనర్జీ. 60 ఏళ్లు దాటినా కుర్ర హీరోలకు పోటీగా ఆయన వేసే స్టెప్పులు, చూపించే గ్రేస్ చూసి మురిసిపోని అభిమాని ఉండడు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవికి సంబంధించి బయటకు వచ్చిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి గారికి ఒక చిన్న సర్జరీ జరిగిందని, అయితే ఈ విషయాన్ని ఆయన టీమ్ అత్యంత గోప్యంగా ఉంచుతోందని సమాచారం.
గత కొంతకాలంగా చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం సరిగా నడవలేని స్థితి ఉన్నప్పటికీ, తన అప్-కమింగ్ సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆయన భావించారట. నొప్పిని పంటిబిగువున భరిస్తూనే, ఫ్యాన్స్‌కు కావాల్సిన వినోదాన్ని పంచడం కోసం షూటింగ్ పూర్తి చేశారు. సినిమా పూర్తయిన వెంటనే, ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా చిన్న సర్జరీ చేయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో, అభిమానుల్లో ఎలాంటి కంగారు ఉండకూడదనే ఉద్దేశంతోనే చిరు టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. పైగా, సర్జరీ విజయవంతంగా ముగియడం, చిరు కోలుకోవడం కూడా జరిగిపోయింది. అందుకే ఇప్పుడు డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలని మెగా టీమ్ ప్లాన్ చేస్తోందట.
ఈ వారంలోనే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వేదికపై చిరంజీవి ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, సినిమా ప్రమోషన్లలో కూడా యాక్టివ్ కానున్నారని సమాచారం. కాగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. 11న ప్రీమియర్స్ పడనున్నాయి. ఇందులో నయన్ హీరోయిన్ కాగా.. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో యాక్ట్ చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. చిరు వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్ చూస్తుంటే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెగా జాతర ఖాయమనిపిస్తోంది.