ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు వల్లభనేని వంశీ. ఒకప్పుడు మాస్ లీడర్‌గా, టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా వెలిగిన వంశీ.. ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఆయన నియోజకవర్గానికి, మీడియాకు దూరంగా ఉంటుండటంతో ఆయన రాజకీయ రిటైర్మెంట్ వార్తలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
గన్నవరం గడ్డపై తిరుగులేని నేతగా ఎదిగిన వంశీ, 2019లో జగన్ గాలి వీస్తున్న సమయంలోనూ టీడీపీ నుండి గెలిచి తన సత్తా చాటారు. అయితే, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన వైసీపీ గూటికి చేరడం, అప్పటి నుండే ఆయన రాజకీయ పతనం మొదలైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఉన్నప్పుడు వంశీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అధినేతను ప్రసన్నం చేసుకునే క్రమంలో చంద్రబాబు, లోకేష్‌లపై ఆయన చేసిన వ్యక్తిగత విమర్శలు సామాన్య ప్రజల్లో కూడా ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి.
వంశీ రాజకీయ ప్రస్థానంలో గత రెండేళ్లు అత్యంత క్లిష్టమైనవిగా చెప్పవచ్చు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు పలు ఇతర కేసుల్లో ఆయన సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 2025 జూలైలో బెయిల్‌పై విడుదలైన తర్వాత, ఆయన గతంలోలాగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఆయన సుమారు 20 కిలోల వరకు బరువు తగ్గారు. వంశీ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గానికి ఆయన దాదాపు దూరంగా ఉంటున్నారు. అడపా దడపా హైదరాబాద్ నుండి వచ్చి వెళ్తున్నారే తప్ప, గతంలోలాగా క్షేత్రస్థాయిలో కేడర్‌తో మమేకం కావడం లేదు. అనారోగ్య సమస్యలు ఒకవైపు, కుటుంబ ఒత్తిడి మరోవైపు ఆయన్ని రాజకీయాల నుండి విరామం తీసుకోమని సూచిస్తున్నాయట. అయితే, వైసీపీ అధినేత జగన్ మాత్రం వంశీని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గన్నవరంలో వంశీకున్న బలమైన కేడర్, ఆయన వాగ్ధాటి పార్టీకి అవసరమని హైకమాండ్ భావిస్తోంది. త్వరలో ఆయనను మళ్లీ యాక్టివ్ చేసేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కానీ వంశీ మాత్రం రాజకీయాల పట్ల విముఖతగా ఉన్నారని ఇన్‌సైడ్ టాక్. ఈసారి టికెట్ మరెవరికైనా ఇచ్చుకోండి అన్నట్లు హైకమాండ్‌కు సందేశాలు కూడా పంపుతున్నారట. కాగా, ఇప్పటివరకు వంశీ తన రాజకీయ భవిష్యత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఆయన ప్రవర్తన, నియోజకవర్గానికి దూరంగా ఉండటం చూస్తుంటే.. వల్లభనేని వంశీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? అన్న సందేహాలు బలపడుతున్నాయి.