సాధారణంగా చేపల మార్కెట్‌కు వెళ్తే కిలో రెండు వందలో, ఐదు వందలో ఉంటుంది. బాగా డిమాండ్ ఉన్న చేపలైతే వేలల్లో ఉంటాయి. కానీ, ఒకే ఒక్క చేప ఏకంగా రూ. 28 కోట్లు పలికిందంటే నమ్ముతారా? అవును, మీరు చదివింది నిజమే! జపాన్ రాజధాని టోక్యోలోని ప్రఖ్యాత ‘టుయోసు’ ఫిష్ మార్కెట్‌లో జరిగిన 2026 నూతన సంవత్సర తొలి వేలంలో ఒక భారీ ట్యూనా చేప ఈ భారీ ధరను సొంతం చేసుకుని వర్లడ్ రికార్డ్‌ను సృష్టించింది.
జపాన్ ఉత్తర తీరంలోని ‘ఓమా’ ప్రాంతంలో పట్టుబడిన 243 కిలోల బరువున్న ‘బ్లూఫిన్ ట్యూనా’ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిని దక్కించుకోవడానికి ప్రముఖ వ్యాపారులు పోటీ పడగా, చివరికి జపాన్ ‘ట్యూనా కింగ్’గా పిలవబడే కియోషి కిమురా 510.3 మిలియన్ల జపనీస్ యెన్లకు దీనిని కైవసం చేసుకున్నారు. 2019లో ఆయనే నెలకొల్పిన రూ. 21 కోట్ల రికార్డును ఈ ఏడాది ఆయనే తిరగరాశారు.
అయితే కేవలం ఒక చేపకు ఇన్ని కోట్లు ఎందుకు పోస్తున్నారనే సందేహం రావడం సహజం. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. జపాన్ సంప్రదాయం ప్రకారం, కొత్త ఏడాదిలో జరిగే మొదటి వేలంలో అత్యధిక ధర వెచ్చించి చేపను కొనడం అనేది అదృష్టానికి, వ్యాపార వృద్ధికి సంకేతంగా భావిస్తారు. అలాగే ఓమా తీరంలో దొరికే బ్లూఫిన్ ట్యూనాను `బ్లాక్ డైమండ్` అని పిలుస్తారు. దీని మాంసంలో ఉండే కొవ్వు శాతం, రుచి ప్రపంచంలో మరెక్కడా దొరకదు. సుషీ ప్రియులకు ఇది ఒక గొప్ప విందు. అదే విధంగా వేలంలో రికార్డు ధర వెచ్చించడం వల్ల ఆ వ్యాపార సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
ఇక ఇంత భారీ ధర పెట్టి కొన్న కిమురా, ఈ చేపను తన ‘సుషీ జాన్మాయ్’ రెస్టారెంట్లలో కస్టమర్లకు వడ్డించనున్నారు. విశేషమేమిటంటే, ఆయన ఈ చేప కోసం కోట్లు ఖర్చు చేసినప్పటికీ, కస్టమర్ల నుండి మాత్రం సాధారణ ధరనే వసూలు చేస్తామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ అదృష్టం కలగాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.