యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హారర్ ఫాంటసీ మూవీ `ది రాజా సాబ్`. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి, సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.
సాధారణంగా హారర్ సినిమాల్లో దయ్యాలు, చేతబడులు చూపిస్తుంటారు. కానీ మారుతి మాత్రం తన స్టైల్‌లో ఒక కొత్త పాయింట్‌ను లీక్ చేశారు. ``ఈ సినిమాలో దయ్యం అనేది ఒక కల్పిత కథ మాత్రమే. కానీ అసలైన కథ అంతా హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది`` అని ఆయన స్పష్టం చేశారు. మనిషి మెంటల్‌గా ధైర్యంగా ఉంటే ఎంతటి పెద్ద దయ్యాన్నైనా ఎదురించగలడనే సందేశాన్ని, ఒక విభిన్నమైన స్క్రీన్ ప్లేతో మారుతి ఆవిష్కరించబోతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు, ఆయనకు మరియు ఆయన నానమ్మకు మధ్య ఉండే బాండింగ్ సినిమాకు ఆత్మ వంటిదని మారుతి తెలిపారు. ``రియల్ లైఫ్ ఎమోషన్స్ నుంచి ఈ పాత్రలను తీసుకున్నాను. వీరిద్దరి మధ్య ఉండే సెంటిమెంట్ థియేటర్లో ఆడియన్స్‌ను కదిలిస్తుంది`` అని ఆయన పేర్కొన్నారు. కేవలం కామెడీ, హారర్ మాత్రమే కాదు, ఒక బలమైన ఫ్యామిలీ ఎమోషన్ కూడా రాజాసాబ్ లో ఉంటుందని మారుతి స్పష్టం చేశారు. మొత్తానికి మెంటల్ బ్యాలెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే యూనివర్సల్ పాయింట్‌తో రాబోతున్న రాజాసాబ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.