కొత్త సంవత్సరం సరికొత్తగా ఉంటుందని భావించిన వారికి తగ్గట్లే అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి షాకిచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ పోలీస్ గా తనను తాను భావించే స్థాయిని పీక్స్ కు తీసుకెళుతూ.. తన ప్రయోజనాలకు భంగం వాటిల్లే దేశాలపై సుంకం పిడుగు వేస్తున్న అగ్రరాజ్యం.. తన తీరును మరింత కఠినతరం చేసే ప్రక్రియ వెనెజువెలా రూపంలో బయటకు రావటం.. రానున్న రోజుల్లో ఇదే తరహా పరిస్థితులు మరెన్ని దేశాలకు ఎదురవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా వెనెజువెలా అధ్యక్ష పదవిని డెన్సీ రోడ్రిగ్జ్ చేపట్టటం తెలిసిందే. తాము చెప్పినట్లు వినకుంటే కొత్త అధ్యక్షురాలికి ముదురో కంటే దారుణ పరిస్థితులు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. దీంతో.. వెనెజువెలా అడుగులు అమెరికాకు అనుగుణంగా పడాలన్న విషయంపై పూర్తి క్లారిటీ వచ్చినట్లే. ఇదే సమయంలో తాజాగా అధ్యక్ష పదవిని చేపట్టిన డెన్సీకి ఏపీకి మధ్యనున్న భావోద్వేగ అనుబంధం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికి పలుమార్లు ఆమె ఏపీని సందర్శించిన వైనం బయటకు వచ్చింది. కారణం.. ఆమె పుట్టపర్తి సత్యసాయి భక్తురాలు. వెనెజువెలా ఉపాధ్యక్ష పదవిలో ఉండగా పలుమార్లు ఏపీకి రావటం.. పుట్టపర్తికి వచ్చి వెళ్లటాన్ని జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో పుట్టపర్తికి వచ్చిన ఆమె.. సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచంలో జరిగే పలు ఉదంతాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఏదో విధమైన లింకు ఉంటుందన్న వాదనకు తాజా ఉదంతం బలం చేకూరిందని చెప్పాలి.