ఇంటి ఆడపిల్లకే కేసీఆర్ అన్యాయం చేశారా?

admin
Published by Admin — January 06, 2026 in Telangana
News Image

అందరికి కనిపించే అంశాలు ఒకలా ఉంటాయి. వీటికి భిన్నంగా బయటకు రాని అంశాలెన్నో. ప్రతి ఒక్కరికే కాదు. ప్రతి ఇంటికి సంబంధించి బయటకు వచ్చేవి.. బయటకు రానివి ఎన్నో అంశాలు ఉంటాయి. అలాంటిది కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసే కుటుంబాల్లో చోటు చేసుకునే పరిణామాలు సాధారణంగా బయటకు రావు. కొన్నిసార్లు అనూహ్య రీతిలో వెలుగు చూస్తుంటాయి. తాజాగా కల్వకుంట్ల కవిత కారణంగా గులాబీ కోటకు సంబంధించిన ఎన్నో రహస్యాలు వెలుగు చూస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ అంశం పెను సంచనలంగా మారింది. సొంత సోదరుడి మీదా.. మేనబావ మీద గడిచిన కొంతకాలంగా విరుచుకుపడుతున్న కవిత.. తాజాగా తెలంగాణ మండలిలో చేసిన ప్రసంగం.. తన వాదనను వినిపించే క్రమంలో ఆమె కన్నీరు పెట్టిన వైనం చూసినప్పుడు.. ఇంటి ఆడపిల్లకు కేసీఆర్ అన్యాయం చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తనది ఆస్తుల పోరాటం కాదని.. ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నట్లుగా చెప్పిన కవిత.. తన వాదనను ప్రజలు నమ్మాల్సిందేనన్న విషయాన్ని భావోద్వేగంగా చెప్పిన వైనం మరింతగా ఆకర్షిస్తోంది. ‘‘మా ఇలవేల్పు లక్ష్మీ నర్సింహస్వామి మీద.. మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా..’’ అంటూ చెప్పిన విషయాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. గులాబీ కోటకు కొత్త గుబులు రేపేలా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఎన్నో పోరాటాలు చేశానని.. తెలంగాణ సాధించిన 2014లో వచ్చిన మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే తనపై ఆంక్షలు మొదలైనట్లు చెప్పి సంచలనానికి తెర తీశారు. తనపై కక్ష కట్టి.. కుట్ర చేసి బయటకు పంపినట్లుగా ఆమె ఆరోపించారు. అవమానభారంతో అన్ని బంధాలు.. బంధనాలు తెంచుకొని ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పిన ఆమె.. గులాబీ పార్టీ నుంచి తాను బయటకు రావటం సంతోషంగా ఉందని చెప్పి కొత్త సంచలనానికి తెర తీశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలకు ఆశ ఉండేదని.. కానీ వారి ఆశలన్నింటినీ పదేళ్ల కాలంలో ఆడియాసలు చేశారన్న కవిత.. ‘‘ తెలంగాణ కోసం పోరాడిన లక్షలాదిమంది ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ లో ఇసుమంత గౌరవం కూడా దక్కలేదు. అమర వీరుల స్మారక స్తూపం, అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సగా మార్పు చేయడాన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించా. తెలంగాణలో ఏం పీకి కట్టామని.. జాతీయ స్థాయిలో పీకుతామని బీఆర్ గా మార్చారు. నాది ఆస్తుల పోరాటంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటోంది. రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్ జీవో నడపాలనే ఆలోచనలో ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ వాళ్లే పిలిచి నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఏ మహిళ అయినా పిల్లల్ని వదిలి రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచన చేస్తుంది. నేను కూడా నాలుగు నెలల పాటు నా జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా. నిజామాబాద్ ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఫలితంగా అక్కడి మొత్తం ఎమ్మెల్యే స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది’’ అంటూ తన గురించి చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ కు చెందిన కొందరు కొత్త నాయకులు.. ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు సైతం తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటని ప్రశ్నిస్తున్నారన్న కవిత.. అందుకు సంబంధించి కీలక అంశాల్ని బయటపెట్టారు. ‘గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ ఉద్యమం చేశా. తెలంగాణ కోసం మాట్లాడాలని పిలిస్తే కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లాం. రెండు నెలల పాటు అక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడూ పలుకరించలేదు. పట్టించుకోలేదు. అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ తో కేసీఆర్ కు సమావేశం ఏర్పాటు చేయించా. ఆ తర్వాతి రోజే సోనియాగాంధీ ఒక్కరోజులోనే ఏడెనిమిదిసార్లు కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు. 2013ఆగస్టు, సెప్టెంబరులలో ఉద్యమకారులంతా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు భయపడాల్సి వచ్చింది. ఆంధ్రా లాబీ కారణంగా తెలంగాణ ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందని అంతా భయపడ్డాం. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది. ఇందులో నా పాత్ర ఎంతో ఉంది’’ అంటూ తెలంగాణ సాధనలో తన పాత్రను వివరంగా చెప్పుకొచ్చారు కవిత.

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన తాను సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న పెద్దపల్లి -నిజామాబాద్ రైల్వే లైన్ ను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జాగృతి పేరుతో ఎనిమిదేళ్ల పాటు బతుకమ్మ ఉత్సవాల్ని నిర్వహించానని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే ఆంక్షలు మొదలైనట్లుగా చెప్పి సంచలనంగా మారారు. అప్పటి టీఆర్ఎస్ కు చెందిన పత్రిక కానీ చానల్ కానీ తనకు మద్దతు ఇవ్వలేదన్న కవిత.. ‘అయినా ధైర్యంగా ముందుకు వెళ్లా. ఏ పార్టీ అయినా రాజ్యంగ స్ఫూర్తితో పని చేయాలి. బీఆర్ఎస్ లో ఆ స్ఫూర్తి లేదు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. కేసీఆర్ పై కక్షతోనే నన్ను జైల్లో పెట్టారు. ఆ సమయంలో పార్టీ నాకు అండగా నిలవలేదు. వదిలేసింది. ఈడీ.. సీబీఐలతో మూడేళ్లు నాకు నేనే పోరాడా. ఘోష్ కమిటీ విచారణ సందర్భంగా కేసీఆర్ ను ఎన్నో మాటలు అంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడూ మాట్లాడలేదు. జాగృతి సంస్థ ద్వారా నేనే పోరాడా’’ అంటూ తాను చేసిన పనుల చిట్టాను విప్పారు. మొత్తంగా పార్టీకి.. పార్టీ అధినేతకు తానెంతో చేసినా.. తనకు ఏమీ చేయలేదని చెప్పటం ద్వారా.. ఇంటి ఆడపిల్లకే కేసీఆర్ ఏమీ చేయలేదన్న విషయాన్ని కవిత చెప్పకనే చెప్పేశారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయాల్ని ఏకరువు పెట్టిన కవిత మాటల్లో నిజం ఎంత ఉందన్నది పక్కన పెడితే.. ఆమె సంధించిన ప్రశ్నలకు గులాబీ కోట ఉక్కిరిబిక్కిరి అవుతుందని మాత్రం చెప్పకతప్పదు.

Tags
Kcr kalvakuntla kavita injustice
Recent Comments
Leave a Comment

Related News