బీఆర్ ఎస్ పార్టీ మాజీ నాయకురాలు.. కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. మంగళవారం సాయంత్రం సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం.. ఆయన సచివాలయ సిబ్బందితో చర్చించిన అనంతరం.. కవిత రాజీనామాను ఆమోదించినట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు.
బీఆర్ ఎస్ హయాంలో గత పార్లమెంటు ఎన్నికల్లో నిజమాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవిత.. తర్వాత కాలంలో మండలిలో అడుగు పెట్టారు. దాదాపు ఏడాదిన్నరపాటు బాగానే ఉన్నప్పటికీ.. అంతర్గత విభేదాలతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. డియర్ డాడీ లేఖతో సంచలనం రేపారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
వాస్తవానికి బీఆర్ ఎస్ పార్టీ కవితను బహిష్కరించలేదు. కేవలం సస్పెండ్ మాత్రమే చేసింది. అయితే.. దీనిని ఆమె తీవ్రంగా పరిగణించి.. పార్టీని వదిలేశారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. దీనినే త్వరలోనే ఆమె రాజకీయ పార్టీగా మార్చనున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఎమ్మెల్సీ పదవికి నాలుగు మాసాల కిందటే(పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత) రాజీనామా చేశారు. అనంతరం.. తన రాజీనామాను ఆమోదించాలని కూడా కోరుకున్నారు.
ఇక, ఈ నెల 5న మండలిలో కన్నీరు పెట్టడం.. తన రాజకీయ భవితవ్యాన్ని కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి కవిత కోరుకున్నారు. తాను తిరిగి శక్తిగానే సభకు తిరిగి వస్తానని శపథం కూడా చేశారు. ఈ పరిణామాలతో మండలి చైర్మన్ ఆమె చేసిన రాజీనామాను ఆమోదించారు. కాగా.. ఖాళీ అయిన ఈ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది.