ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. విజనరీ నేతగా పేరున్న చంద్రబాబు ఈ తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని సువిశాలమైన రాజధాని నిర్మాణం చేపట్టారు. అమరావతి నిర్మాణం కోసం మొదటి విడతలో 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన సీఆర్డీఏ...తాజాగా రెండో విడతలో 26 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ మొదలుబెట్టారు.
వడ్లమాను నుంచి మలివిడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని నారాయణ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన గ్రామ సభలో రైతులతో నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా తమకున్న సందేహాలను రైతులు నివృత్తి చేసుకున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే తమ భూముల సంగతి ఏమిటన్న అనుమానాలను పలువురు రైతులు లేవనెత్తారు. అయితే, అటువంటి భయం అక్కర లేదని నారాయణ హామీనిచ్చారు.
అంతేకాదు, అమరావతికి భూములిచ్చే రైతులు ఇప్పటి వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయబోతున్నామని, రూ.1.50 లక్షల వరకు రుణం మాఫీ అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అభ్యర్థనను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశానని, అందుకు ఆయ కూడా అంగీకరించారని చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అమరావతి కోసం సేకరించిన భూమిని సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని, మూడేళ్లలో ఎయిర్ పోర్ట్, క్రీడా ప్రాంగణం పూర్తి చేస్తామని హామీనిచ్చారు.