ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న రాజకీయ ఆశావహులకు నిరాశ తప్పేలా లేదు. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం 2026 మార్చితో ముగియనున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మౌనంగా ఉంది. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం, కనీసం మరో ఏడాదిన్నర వరకు అంటే 2027 ప్రారంభం వరకు ఎన్నికల ఊసే ఉండేలా కనిపించడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై సుముఖంగా ఉన్నప్పటికీ, కేంద్రం చేపట్టనున్న `జనగణన` ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. గత పదేళ్లుగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన జరగాల్సి ఉంది. 2011 నాటి పాత లెక్కల ప్రకారం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, అది భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కొత్త జనగణన డేటా అందుబాటులోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను శాస్త్రీయంగా ఖరారు చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ ఏపీ మున్సిపల్ పోరు 2027 ప్రారంభంలోనే ఉండేలా కనిపిస్తోంది.
అయితే అధికార కూటమి ఈ సమయాన్ని ఒక వరంగా భావిస్తోంది. ఎన్నికలకు వెళ్లేముందు తమ సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి వంటి కీలక నగరాలను గ్రేటర్ కార్పొరేషన్లుగా మార్చే ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. జనగణన తర్వాతే ఈ నగరాల రూపురేఖలను మార్చి, కొత్త ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా క్లీన్ స్వీప్ చేయాలని కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. కాగా, రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల పదవీకాలం 2026 మార్చితో ముగుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకపోతే, మున్సిపల్ బాధ్యతలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్తాయి. అంటే సుమారు 9 నెలల నుండి ఏడాది పాటు అధికార యంత్రాంగమే పాలన సాగించాల్సి ఉంటుంది.