అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం మారితే అమరావతి రాజధాని పనులు ఆగిపోతాయని మంత్రి నారాయణతో కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారికి నారాయణ భరోసానిచ్చారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తామని, రైతులకు ఇబ్బంది ఉండదని అన్నారు. అదే సమయంలో అమరావతికి చట్టబద్ధత విషయంపై న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు..అమిత్ షాతో భేటీ అయ్యారు. అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు కోరారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధి వేగవంతం కావడంలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జీ రామ్ జీ పథకంలో 60:40 నిష్పత్తి వల్ల ఏపీకి ఇబ్బంది అని, తమకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించాలని కోరారు.