జగన్ ని దీంతో పాటు అమర్ రాజాని తరిమేసిన క్రెడిట్ కూడా తీస్కో మనండిరా భయ్… మేం క్రెడిట్ కోసం పని చేయట్లా..మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మంత్రి నారా లోకేశ్ చేసిన ఈ సెటైరికల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో పాటు పీపీఏల రద్దు, అమర రాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేయడం, లేబర్, పొల్యూషన్ పేరుతో అనేక కంపెనీలను తరిమేయడం, ఆనాడు పల్లా శ్రీనివాసరావు గారి కమర్షియల్ కాంప్లెక్స్ కు అన్ని అనుమతులు ఉన్నా పగలగొట్టిన క్రెడిట్ కూడా జగన్ తీసుకోవచ్చని చురకలంటించారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం తాము పోరాడటం లేదని లోకేశ్ స్పష్టం చేశారు. బాధ్యతగా పనిచేసేందుకు, ప్రజలకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోందని చెప్పారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అని జగన్ రెడ్డి ఆనాడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని లోకేశ్ చురకలంటించారు. ఎయిర్ పోర్టు కోసం జీఎంఆర్ కు కేటాయించిన 2,600 ఎకరాలలో 600 ఎకరాలను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి వెనక్కు ఇచ్చామని తెలిపారు.
తన పేరిట గతంలో సాక్షి పత్రికలో ప్రచురితమైన అసత్య కథనాలపై లోకేశ్ ఆరేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ కోర్టుకు హాజరైన లోకేశ్ ...ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. ఫార్చ్యూన్-500 కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూమి ఇస్తే తప్పేంటని లోకేశ్ ప్రశ్నించారు. ఉద్యోగాలు కల్పించేందుకు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని, కాబట్టే కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. టాప్-100 ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకువస్తామని, ఆర్థిక రాజధాని విశాఖ అని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.