రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తన మీద గౌరవంతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టు పనులు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో, చంద్రబాబు, రేవంత్ లపై వైసీపీ నేతలు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు. రాయలసీమ ఎత్తిపోతలపై కొందరు చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదని, అబద్ధాలను 100సార్లు చెబితే నిజమయిపోదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదని, నీటి విషయంలో రాజకీయాలు వద్దని కోరారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని హితవు పలికారు. తాము దేవాదుల ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుకూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు.
కృష్ణా నదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి పైన ప్రాజెక్టులు కడితే నష్టమని, గోదావరి డెల్టాను కాపాడుకుని కృష్ణా-గోదావరి అనుసంధానం చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు.
వైసీపీ నిర్వాకం వల్లే పోలవరం 6-7 ఏళ్లు ఆలస్యమైందని విమర్శించారు. వైసీపీ అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అనుమతులు లేని ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఎన్జీటీకి రూ. 100 కోట్ల జరిమానా కట్టారని విమర్శించారు. కొత్తగా పోలవరం డయాఫ్రం వాల్ కడుతున్నామని, ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేస్తామని చెప్పారు.