రాజకీయాల్లో విశ్వసనీయత అంటే ఏమిటో మనకు తెలీదు కానీ, జగనన్న దృష్టిలో మాత్రం రక్తాభిషేకం చేసిన వాడే అసలైన సైనికుడు. గత నెలలో జగన్ పుట్టినరోజు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు చేసిన ‘రప్పా రప్పా’ విన్యాసాలు గుర్తున్నాయిగా? నిలువెత్తు జగనన్న ఫ్లెక్సీ ముందు ఒక పొట్టేలును బలి ఇచ్చి, ఆ రక్తంతో ఆయన కటౌట్‌కు అభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుండి ఆందోళన వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన నల్లజర్ల పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు వైసీపీ కార్యకర్తలను గుర్తించి అరెస్ట్ చేశారు.
బహిరంగ ప్రదేశంలో జంతు బలి ఇవ్వడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అభియోగాలపై వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే అరెస్ట్ చేసిన నిందితులను రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఆపై కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు ఎదుర్కొంటున్న గోపాలపురం కార్యకర్తలు తాజాగా మాజీ హోంమంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ తానేటి వనిత ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
ఆ ఏడుగురు కార్యకర్తలకు పొట్టేలును నరికినప్పుడు రాని భయం, పోలీసులు వారిని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించినప్పుడు కలిగిందట. జగన్‌ను కలిసిన ఈ రక్త వీరులు, పోలీసులు తమను రోడ్డు మీద నడిపించి ఎంత అవమానించారో వివరించి కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. జంతు బలి ఇచ్చి సమాజంలో అలజడి రేపినందుకు మందలించాల్సింది పోయి, జగన్ వారికి వెన్నుతట్టి భరోసా ఇచ్చారు. “ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు.. పార్టీ న్యాయ విభాగం మీకు అండగా ఉంటుంది” అని మన మాజీ సీఎం కొండంత భరోసా కల్పించారు.
అక్కడితో ఆగకుండా కూటమి ప్రభుత్వ అండతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగనన్న ఆరోపించారు. కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించేలా పోలీసులు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే దానిని చేతుల్లోకి తీసుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ జగన్ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే, నిడిరోడ్డుపై పొట్టేలును కోసి రక్తంతో అభిషేకం చేయడం అభిమానం.. కానీ, వారిని చట్టం ముందు నిలబెట్టడం మాత్రం రాజకీయ కక్ష అని జగన్ చెప్పకనే చెబుతున్నారు.