ఐ ప్యాక్.. ఈ పేరు అందరికీ సుపరిచితమే. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించినప్పుడు ఆయన శిష్యుడు స్థాపించిన ఐప్యాక్ సంస్థ.. ఏపీలో జగన్‌కు గత ఎన్నికలకు ముందు సేవలు అందించింది. అయితే.. ఇప్పుడు త్వరలోనే జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీకి సేవలు అందిస్తోంది. రాజకీయ వ్యూహాలతో వచ్చే ఎన్నికల్లో టీఎంసీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తోంది.
అయితే.. బెంగాల్‌లో ఈ దఫా తాము అధికారంలోకి రావాలని పక్కాగా నిర్దేశించుకున్న బీజేపీ.. దీనికి తగిన విధంగా అడుగులు వేస్తోంది. అయితే. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలైనా వేయొచ్చు. దీనిని ఎవరూ కాద నరు. కానీ.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రాజకీయ వ్యూహకర్త సంస్థపైనే ఈడీ దాడులు చేయిస్తు న్నారన్న విమర్శలు తారస్థాయికి చేరాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీలు.. పలువురు ఈడీ దాడులను ఖండిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం ముందు ధర్నాకు దిగారు.
వాస్తవానికి ఇప్పటి వరకు.. రాజకీయ వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్న లేదా.. ముందస్తు ఫలితం చెప్పే సంస్థలపైనా ఈడీ దాడులు చేసిన చరిత్ర లేదు. తొలిసారి బెంగాల్‌లో ఐప్యాక్ సంస్థపై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్ ద్వారా నిధులు వస్తున్నాయంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని అధికారులు తెలిపారు.కాగా.. టీఎంసీ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.
హోం మంత్రి అమిత్ షా నివాసం ముందు.. ఎంపీలు ఆందోళనకు దిగారు. అయితే.. పోలీసులు వీరిని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి తీసుకువెళ్లడం మరో రచ్చగా మారింది. పోలీసుల వ్యవహార శైలిని ఖండిస్తూ.. కోల్‌కతాలో టీఎంసీ వర్గాలు ఆందోళనకు దిగాయి. మొత్తంగా బెంగాల్ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ కూడా రాకుండానే.. రచ్చ రాజకీయాలు తెరమీదికి రావడం గమనార్హం.