ప్రభాస్, మారుతిల కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’కు సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. విడుదల రోజు కూడా మార్పేమీ కనిపించలేదు. రివ్యూలు, టాక్ రెండూ మిక్స్డ్‌గానే ఉన్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడం ఒక నిరాశ అయితే.. ట్రైలర్లో హైలైట్‌గా నిలిచిన సీన్లు సినిమాలో లేకపోవడం మరో డిజప్పాయింట్మెంట్.
ప్రభాస్‌ను ఓల్డ్ కింగ్ గెటప్‌లో చూపించిన సీన్లు ఫస్ట్ ట్రైలర్లో క్రేజీగా అనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్లన్నింట్లో కూడా ఆ లుక్‌నే వాడుకున్నారు. చివరికి సినిమాలో చూస్తే ఆ సీన్లు లేవు. ‘రాజాసాబ్’ ఫైనల్ కట్ 3 గంటల 10 నిమిషాల దాకా వచ్చింది. అప్పటికే నిడివి ఎక్కువైందని ఆ సీన్లు తీసేసినట్లున్నారు. కానీ అవసరం లేని మరెన్నో సీన్లను పెట్టి ఆ ఎపిసోడ్ లేపేయడం ఏంటో ప్రభాస్ ఫ్యాన్స్‌కు అర్థంకాలేదు.
ఐతే రాజు క్యారెక్టర్ని లేపేయడంపై నిన్నట్నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి టీం అలెర్ట్ అయింది.
ఆ సీన్లన్నింటినీ సినిమాలో పెట్టడానికి మేకర్స్ నిర్ణయించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఈ సీన్లను సినిమాలో కలుపుతున్నారట. అంతే కాక సినిమాలో అవసరం లేని వేరే సీన్లను కట్ చేస్తున్నారట. ఇంతకుముందు ‘రాజాసాబ్’ ప్రెస్ మీట్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సినిమాలో కొన్ని స్పెషల్ సీన్లను మధ్యలో కలపబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
బహుశా అవి ఇవేనేమో. కానీ ఈ ఆలోచన బూమరాంగ్ అయింది. ప్రభాస్ రాజుగా ఉన్న సీన్లు సినిమాలో లేకపోవడం చూసి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. వీటిని పార్ట్-2 కోసం పెట్టుకున్నారేమో అనుకున్నారు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే టీం ఆ సీన్లను యాడ్ చేయాలని నిర్ణయించింది. మరి ఈ ఆలోచన సినిమాకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.