పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభలో ఈ ఏడాది స్పెషల్ గా నిలవనుంది. ఎందుకంటే.. తన మొత్తం సభ్యుల్లో దగ్గర దగ్గర 35 శాతం మంది రిటైర్ కానుండటమే దీనికి కారణం. అంతేకాదు.. వయసు మీద పడిన వేళ.. ఈ ఏడాది రెండు దఫాలుగా రిటైర్ అయ్యే రాజకీయ పెద్దల్లో ఎంతమంది తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోగలుగుతారు? అన్నదిప్పుడు మరో ప్రశ్న. ఈ ఏడాది రిటైర్ అయ్యే రాజ్యసభ సభ్యుల వివరాల్ని తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్నారు. మొత్తంగా పెద్దల సభలో సభ్యుల సంఖ్య 250 అయితే.. ఈ ఏడాది ఏకంగా 73 మంది రిటైర్ కానున్నారు.
ఇలా రిటైర్ అయ్యే వారిలో అత్యంత సీనియర్లు.. దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తూ.. తమదైన ముద్ర చేసినోళ్లు బోలెడుమంది ఉన్నారని చెప్పాలి. కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్న మల్లికార్జున్ ఖర్గే మొదలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి.. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్.. మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ తదితర ప్రముఖుల టర్మ్ లు ముగుస్తాయి. వీరిలో ఎందరి సభ్యత్వాలు రెన్యువల్ అవుతాయన్నది ప్రశ్న.
వయసు మీద పడటం.. 80లకు దగ్గర్లో ఉన్న వీరిలో ఎందరిని ఎంపిక చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక.. మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గోగోయ్ లాంటి వారు నామినేటెడ్ కోటాలో పెద్దల సభకు ఎంపిక కావటం తెలిసిందే. మరి.. ఇలాంటి వారికి మళ్లీ అవకాశం లభిస్తుందా? కొత్త ముఖాలకు అవకాశమిస్తారా? అన్నది ప్రశ్న. చాలా తక్కువమంది మినహా మిగిలిన వారికి మళ్లీ అవకాశం లభించే అవకాశం లేదంటున్నారు. వయసు మీదపడటం.. ఆరోగ్య సమస్యల కారణంగా యాక్టివ్ గా లేకపోవటం లాంటి కారణాలతో వారి సుదీర్ఘ ప్రయాణాలు 2026లో ముగుస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఈ ఏడాది రిటైర్ అయ్యే రాజ్యసభ సభ్యులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి నలుగురు ఉంటే.. తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏపీ నుంచి రిటైర్ అయ్యే వారిలో వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీలు రిటైర్ కానున్నారు. ఈ ఏడాది మొత్తం 73 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మరొకటి.. నామినేటెడ్ పద్దతిలో ఎంపిక కావటంతో.. ఎన్నిక జరగదు.
ఈ ఏడాది రెండు దఫాలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత ఏప్రిల్ లో.. రెండో విడత నవంబరులో జరగే వీలుంది. ఈ ఏడాది జరిగే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకోనుంది. ఒక అంచనా ప్రకారం బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 145కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ లో జరిగే ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ కావొచ్చని చెబుతున్నారు. 2026లో రిటైర్ అయ్యే ఎంపీలు రాష్ట్రాల వారీగా చూస్తే..
- ఉత్తరప్రదేశ్ 10
- తమిళనాడు 6
- పశ్చిమబెంగాల్ 5
- బిహార్ 5
- మహారాష్ట్ర 4
- ఒడిశా 4
- గుజరాత్ 4
- కర్ణాటక 4
- ఏపీ 4
- అసోం 3
- మధ్యప్రదేశ్ 3
- రాజస్థాన్ 3
- చత్తీస్ గఢ్ 2
- హర్యానా 2
- జార్ఖండ్ 2
- తెలంగాణ 2
- హిమాచల్ ప్రదేశ్ 1
- మణిపూర్ 1
- మేఘాలయ 1
- అరుణాచల్ ప్రదేశ్ 1
- మిజోరం 1
- ఉత్తరాఖండ్ 1