టాలీవుడ్‌లో గ్లామర్ ప్లస్ టాలెంట్ ఉన్న హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. ‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పటివరకు కేవలం గ్లామరస్ హీరోయిన్‌గానే గుర్తింపు పొందిన డింపుల్ వెనుక చాలా పెద్ద సినీ సామ్రాజ్యం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టిన నిజాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. డింపుల్ హయతి టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి మనవరాలు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేనిదే రాణించడం కష్టం అని భావించే ఈ రోజుల్లో, ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుని కూడా ఆమె ఎప్పుడూ ఆ విషయాన్ని ప్రదర్శించలేదు. తన సొంత టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకుంటూ రావడం విశేషం. కేవలం దాసరి గారే కాదు, ఆమె కుటుంబం మొత్తం సినీ కళాకారులతో నిండి ఉంది.
డింపుల్ నాన్నమ్మ మరెవరో కాదు.. అలనాటి మేటి నటి ప్రభ. నందమూరి తారకరామారావు గారితో ‘దానవీర శూరకర్ణ’ వంటి క్లాసిక్ సినిమాల్లో నటించి మెప్పించిన ప్రభ వారసురాలిగా డింపుల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతేకాదు, డింపుల్ తల్లి మరియు పిన్నిలు కూడా సినిమా రంగంలో ఉన్నవారే. తెలుగుతో పాటు మలయాళ చిత్రాల్లో కూడా వారు నటించారు.
అయితే కుటుంబం మొత్తం సినీ రంగంలోనే ఉన్నప్పటికీ, డింపుల్‌ను మాత్రం హీరోయిన్ అవ్వొద్దని వారించారట. ``అప్పటి ఇండస్ట్రీ వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.. ఇక్కడ రాణించడం కష్టం`` అని ఆమె ఫ్యామిలీ మొదటి నుంచి చెబుతూనే ఉందట. కానీ నటనపై ఉన్న మక్కువతో, పేరు మార్చుకుని (అసలు పేరు డింపుల్, న్యూమరాలజీ ప్రకారం హయతి అని చేర్చుకుంది) ‘గల్ఫ్’ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం రవితేజతో చేస్తున్న సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఈ భామ గట్టిగా నమ్ముతోంది.