కొన్ని మీడియా సంస్థల్లోనూ.. సోషల్ మీడియాలోనూ మహిళా ఐఏఎస్ మీద ఒక మంత్రి ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని.. తన ఆరాధనతో తడిచి ముద్దయ్యేలా చేస్తున్నారంటూ ఇష్టారాజ్యంగా వస్తున్న వ్యాఖ్యలతో కూడిన కథనాలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రాజకీయాలు తప్పించి తనకు వ్యాపారాల్లేవని.. ప్రతీక్ ఫౌండేషన్ మీద పేదలకు సాయం చేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలతో ఇష్టారాజ్యంగా ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తినని.. అలాంటి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తారా? అని మండిపడ్డారు. ఇప్పటికి కసి తీరకుంటే తనకు కాస్త విషమిచ్చి చంపాలని.. మానసికంగా వేధించటం ఎందుకు? అని ప్రశ్నించారు. ‘నాలాంటోడ్ని వేధించి మీరు సాధించేదేంటి? ఈ మధ్యన ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డిపై ఈ తరహా కథనాలు క్రియేట్ చేశారు. అర్థరాత్రి దాటాక బైక్ మీద వెళ్లారని.. సీఎంవోలో మహిళ తిరుగుతోందని.. ఇన్ చార్జి మంత్రులపై ఆధారాల్లేని కథనాలు ఇటీవల ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించం. ఈ కథనాలపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడతా. వీటిని ఎవరు రాయిస్తున్నారన్న దానిపై వివిద కోణాల్లో విచారణ చేసి.. నివేదిక ఇవ్వాలని కోరా. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరవై రోజుల్లో తేల్చి న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ తరహా ప్రచారాలను వారి కుటుంబాలు తట్టుకోగలవా? ఐఏఎస్.. ఐపీఎస్ కావాలంటే ఆషామాషీగా సాధ్యం కాదు. ఎంసోతో మేధావులైతే ఆ స్థాయికి రాగలుగుతారు. అలా కష్టపడి వచ్చిన అధికారులపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయటం సరికాదు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయన్న కోమటిరెడ్డి.. ‘నాకు దేవుడు.. ప్రజలపై చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఆరుసార్లు ప్రజాప్రతినిధిగా నన్ను గెలిపించింది నా ఫోన్ నంబరు కొన్ని వేల మంది దగ్గర ఉంది. 24 గంటలు నా పీఏ నా ఫోన్ లో అందరికీ అందుబాటులో ఉంటాడు. నిజం చెప్పాలంటే.. ఆ ఫోనే నన్ను గెలిపిస్తూ వస్తోంది. అలాంటిది నా ఫోన్ ను ఇంట్లో వాళ్లు తీసుకున్నారని కూడా రాశారు. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు.
తనకు దేవుడిపై నమ్మకం ఉందని.. ఒకవేళ తాను తప్పు చేస్తే దేవుడు తనను శిక్షిస్తాడని.. ఒకవేళ తనపై తప్పుడు ప్రచారం చేసే వాళ్లు తప్పు చేస్తే వాళ్లను శిక్షిస్తాడన్న కోమటిరెడ్డి.. ‘‘ఈ తరహా కథనాలతో ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. విలువలు దిగజారీ మరీ కొన్నిమీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేయటం ఏమిటి? పోలీసు విచారణ పూర్తయ్యాక.. అవసరమైతే అవాస్తవాలు.. ఊహాజనిత కథనాలను ప్రసారం చేసిన సంస్థలపై దావా కూడా వేస్తాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలాఉండగా.. మహిళా ఐఏఎస్ మీద అసత్య కథనాలపై ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ తరహాలో తప్పుడు ప్రచారాలు చేసిన మీడియా సంస్థలు తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. సోషల్ మీడియాలోనూ.. డిజిటల్ ఫ్లాట్ ఫాంలోని కంటెంట్ ను తొలగించాలని స్పష్టం చేసింది. ఒకవేళ.. అలా చేయకుంటే చట్టపరమైన చర్రయలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. మరి.. ఈ వ్యవహారంపై సదరు మీడియా సంస్థలు ఎలా రియాక్టు అవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.