సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికే కాదు.. తమిళులకూ ప్రత్యేకం. వాళ్లు పొంగల్ అని పిలుచుకునే ఈ పండక్కి పెద్ద సినిమాల సందడి బాగానే ఉంటుంది. ఏటా రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజవుతుంటాయి. ఐతే ఈసారి విజయ్ చివరి చిత్రం జననాయగన్ బరిలో ఉండడంతో పోటీగా ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయలేదు. శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల, అథర్వల కలయికలో తెలుగమ్మాయి సుధ కొంగర రూపొందించిన పరాశక్తిని మాత్రమే రేసులో నిలిపారు.
క్లాష్ ప్రధానంగా విజయ్, శివ సినిమాల మధ్యే ఉంటుందని భావించారు. వేరే చిత్రాలకు థియేటర్లు దక్కే పరిస్థితి కూడా కనిపించలేదు. అందరి దృష్టీ విజయ్ మూవీ మీదే ఉండగా.. ఆ సినిమాకు ఊహించని విధంగా అడ్డంకులు ఎదురయ్యాయి. విజయ్ అభిమానులను విస్మయానికి గురి చేస్తూ ఆ సినిమా వాయిదా పడిపోయింది. ఈ నెల 9న రిలీజ్ కాని ఈ చిత్రాన్ని.. 14న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అదీ సాధ్యపడలేదు. దీంతో తమిళ సంక్రాంతి ముందే సగం కళ తప్పింది.
విజయ్ సినిమా లేదన్న బాధను దిగమింగుకుంటూ అక్కడి ప్రేక్షకులు పరాశక్తి మీద బోలెడు ఆశలతో శనివారం థియేటర్లకు వచ్చారు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తమిళ క్రిటిక్స్ ఆహా ఓహో అని కీర్తిస్తూ మంచి మంచి రేటింగ్స్ ఇచ్చేస్తున్నారు కానీ.. వాస్తవానికి సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతోందన్నది వాస్తవం. ఎంచుకున్నది మంచి కథే అయినా, సుధ కొంగర హానెస్ట్ అటెంప్ట్ చేసినా.. సినిమాలో వినోదం కొరవడడం, డ్రామా పండకపోవడంతో తొలి రోజే థియేటర్లలో జనం పలుచబడిపోయారు. తర్వాతి రోజులకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
సంక్రాంతి అంటే ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్టైన్మెంట్. అదే మిస్సయింది పరాశక్తి చిత్రంలో. పండక్కి జీవా సినిమా ఒకటి, ఇంకేదో చిన్న సినిమా కూడా రిలీజవుతున్నాయి కానీ.. వాటి మీద పెద్దగా ఆసక్తి, అంచనాలు లేవు ప్రేక్షకుల్లో. నిజానికి ముందు సూర్య మూవీ కరుప్పును సంక్రాంతికే అనుకున్నారు. కానీ విజయ్ మూవీతో పాటు పరాశక్తి చాలా ముందే డేట్లు ఖరారు చేసుకోవడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. తీరా చూస్తే విజయ్ మూవీ రాలేదు. శివ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో తమిళ సంక్రాంతి పూర్తిగా కళ తప్పేలా కనిపిస్తోంది.