నందమూరి అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడబోతోంది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. అయితే, ఈ గ్రాండ్ లాంచ్ కోసం బాలయ్య ఎంచుకున్న డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, ఫ్యాన్స్‌లో కాస్త టెన్షన్‌ను కూడా పెంచుతోంది.
నందమూరి క్లాసిక్ `ఆదిత్య 369`కి సీక్వెల్‌గా రూపొందబోతున్న `ఆదిత్య 999 మ్యాక్స్`తో మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను క్రిష్ జాగర్లమూడికి అప్పగించారు బాలయ్య. నిజానికి క్రిష్ గతంలో బాలయ్యకు `గౌతమీపుత్ర శాతకర్ణి` వంటి భారీ హిట్ ఇచ్చారు. కానీ, ఇటీవల ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తేనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. `ఎన్టీఆర్ కథానాయకుడు`, `మహానాయకుడు` ఫలితాలతో పాటు, పవన్ కళ్యాణ్ `హరి హర వీరమల్లు` నుంచి ఆయన తప్పుకోవడం వంటి పరిణామాలు క్రిష్ ఇమేజ్‌ను కాస్త దెబ్బతీశాయి. రీసెంట్ గా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన `ఘాటి` కూడా డిజాస్టర్ అయింది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్‌కు తన కొడుకు కెరీర్‌ను అప్పగించడం బాలయ్య చేస్తున్న సాహసమే అని చెప్పాలి. కానీ, బాలయ్య వెర్షన్ వేరేలా ఉంది. క్రిష్‌కు ఉన్న మేకింగ్ స్టైల్, పీరియడ్ సినిమాలపై ఉన్న పట్టు మోక్షజ్ఞ డెబ్యూకి ప్లస్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ అసెట్ అని టాక్.
షూటింగ్ అప్‌డేట్స్ విషయానికి వస్తే, జనవరి చివరి వారంలో గ్రాండ్ పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మోక్షజ్ఞను అత్యంత స్టైలిష్‌గా చూపించేందుకు క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. మరి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న క్రిష్, నందమూరి వారసుడికి డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మళ్ళీ తన ఫామ్‌ను నిరూపించుకుంటారో లేదో చూడాలి.