జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అయితే ఈసారి రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ధర్మాన్ని మీరితే ఊరుకునేది లేదు.. తేడాలొస్తే తాట తీస్తా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పిఠాపురం వేదికగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా ప్రసంగించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, గత పాలకుల అరాచకాలు మళ్ళీ రాకూడదన్నా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ``చంద్రబాబు నాయుడు గారికి, నాకు మధ్య అద్భుతమైన సయోధ్య ఉంది. ఈ కూటమి మరో 15 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగాలి. అనుభవం ఉన్న నాయకత్వంలో రాష్ట్రం గాడిలో పడాలి`` అని పవన్ స్పష్టం చేశారు.
కూటమిలో పైస్థాయిలో అంతా బాగున్నా, క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో చిన్న చిన్న గొడవలను కూడా కొందరు నేతలు సాగదీస్తున్నారని, ఇది కూటమి ఐక్యతకు భంగం కలిగిస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ``నన్ను మెత్తని మనిషిని అనుకోవద్దు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తగ్గి ఉండవచ్చు, కానీ క్రమశిక్షణ తప్పితే మాత్రం సహించను. పొత్తులో ఉంటూ మిత్రపక్షాలను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను.`` అని పవన్ హెచ్చరించారు.
కేవలం సొంత పార్టీ వారికే కాదు, కుట్రలు చేసే ప్రత్యర్థులకు కూడా పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో అశాంతి సృష్టించాలని చూస్తే తానే స్వయంగా ఇక్కడే కూర్చుని అరాచక శక్తులను ఏరివేస్తానన్నారు. ``పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు కానీ, పిఠాపురంలో చిన్న పిల్లలు గొడవ పడితే దానికి కులం రంగు పులుముతారా?`` అంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.