సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు.. గోదావరి జిల్లాలు అంటేనే సంక్రాంతి! ఈ పండగకు ఆ జిల్లాల్లో ఉండే హడావిడి, మర్యాదలు, కోడి పందాల రచ్చ ప్రపంచ ప్రఖ్యాతి. అయితే, ఈసారి సంక్రాంతి సందడి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో బస చేయాలంటే సామాన్యుల మాట దేవుడెరుగు.. ధనికులు కూడా జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హోటల్ రూమ్ కావాలంటే రోజుకి లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సిందేనంటూ యజమానులు చెప్తున్న రేట్లు విని జనం నోరెళ్లబెడుతున్నారు.
సంక్రాంతి పండగకు ఇంకా సమయం ఉండగానే గోదావరి జిల్లాల్లోని హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు `హౌస్ ఫుల్` బోర్డులను పెట్టేశాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం వంటి ప్రధాన పట్టణాల్లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గదులన్నీ ఇప్పటికిప్పుడు బుక్ అయినవి కావు.. ఏకంగా మూడు నెలల ముందే పందెం రాయుళ్లు, విదేశీ అతిథులు అడ్వాన్సులు చెల్లించి లాక్ చేసేశారు. ఇప్పుడు అర్జెంట్‌గా రూమ్ కావాలంటే ఆకాశాన్ని తాకుతున్న ధరలే దిక్కవుతున్నాయి.
పందెం రాయుళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు హోటల్ నిర్వాహకులు భారీ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. కొన్ని లగ్జరీ హోటళ్లలో ఒక రోజు బసకు రూ. లక్ష వరకు వసూలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల మూడు రోజుల ప్యాకేజీకి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. భీమవరం చుట్టుపక్కల ఉండే ఫార్మ్ హౌస్‌లు, వెడ్డింగ్ హాల్స్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. గదులను రంగురంగుల విద్యుత్ దీపాలు, స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా ముస్తాబు చేసి అతిథులకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు.
కేవలం గదులు మాత్రమే కాదు, వచ్చే అతిథుల కోసం గోదావరి రుచులతో కూడిన ప్రత్యేక మెనూలను కూడా సిద్ధం చేశారు. కాస్ట్ ఎంతైనా పర్లేదు.. మాకు సౌకర్యాలు ముఖ్యం అనే పందెం రాయుళ్ల కోసం ఏసీ గదులు, ప్రత్యేక వాహనాలు, పందెం కోళ్ల బరుల వద్దకు నేరుగా ఎంట్రీ వంటి సదుపాయాలను హోటల్ యాజమాన్యాలు కల్పిస్తున్నాయి. దీంతో పండగ సీజన్‌లో ఈ జిల్లాల్లోని హోటల్ రంగం కాసుల వర్షంలో తడిసిముద్దవుతోంది. మొత్తానికి గోదావరి సంక్రాంతి అంటే సరదా మాత్రమే కాదు.. రేట్ల పరంగా కూడా వెరీ కాస్ట్లీ గురూ అని నిరూపిస్తోంది.