ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు మరో ఇద్దరు రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేయడం, ఎన్టీవీ ఆఫీసులో సర్వర్లు, కంప్యూటర్లు సీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల సోదాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మహిళలకు గౌరవం ఇవ్వాలి, చట్టాన్ని అమలు చేస్తున్నాముని సజ్జనార్ చెబుతున్నారని, అయితే, ఆయనకు ఇప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆనాడు కేటీఆర్ మీద, సమంత మీద కొండా సురేఖ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ చట్టం ఎటుపోయిందని ప్రశ్నించారు. కేటీఆర్ విషయంలో బాధపడింది కూడా ఒక మహిళే కదా అని నిలదీశారు.
ఇక, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి మొత్తం మీడియా రంగాన్ని భయపెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. తన గుప్పిట్లో మీడియాను పెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మీడియా హౌస్ కు పోలీసులు వెళ్లి కంప్యూటర్లు సీజ్ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటి సారి అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అక్రమాలు చేస్తే డీజీపీకి, సజ్జనార్‌కు చట్టాలు గుర్తుకురావా అని ప్రశ్నించారు.