ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, నిర్వహణ జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, పీపీపీ విధానాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పేద ప్రజలకు వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను కూటమి సర్కార్ దూరం చేస్తోందని విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే పీపీపీ విధానానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం 5 మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. న్యూక్లియర్ మెడిసిన్, ఎంఎంయూలు, డెంటల్, రేడియాలజీ, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను పీపీపీ విధానం ద్వారా విస్తరించాలని స్పష్టం చేసింది. ఎక్విప్, ఆపరేట్, మెయింటైన్ (ఈవోఎం), ఆపరేట్ అండ్ మెయింటైన్(ఓ అండ్ ఎం)ల ద్వారా సేవలు పెంచాలని తెలిపింది. ప్రైవేట్ సంస్థలకు చెల్లింపుల విధానంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.