అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ద్వార పాలకుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన సంచలనం రేపింది. ఆలయ ప్రాంగణం బయట ఉన్న ద్వారపాలకుల విగ్రహాలలో ఒకటి ధ్వంసమైంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. క్యారీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు సర్వైలెన్స్ ఫుటేజ్‌ను సమీక్షిస్తున్నారు.
ఈ దర్యాప్తునకు ఆలయ నిర్వాహకులు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగలేదని భక్తులకు తెలిపారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ధ్వంసమైన విగ్రహానికి ఆగమ శాస్త్రం ప్రకారం మరమ్మతు చేయిస్తామని, అవసరమైన ప్రాయశ్చిత్తం చేస్తామని వెల్లడించారు. అందుకు సంబంధించిన పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా భక్తుందరూ శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలని, ప్రార్థనలు చేయాలని కోరారు. విగ్రహాల ధ్వంసం వంటి దుశ్చర్యల వల్ల ఆలయ విశిష్టత తగ్గిపోదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ఆలయ నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. సోషల్ మీడియాలో ఊహాగానాలు, భావోద్వేగ సందేశాలు పోస్ట్ చేయవద్దని కోరారు. శనివారం సాయంత్రం 7:00 గంటలకు శ్రీవారి వద్ద ప్రార్థన నిర్వహించబోతున్నామని నార్త్ కరోలినాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం జాయింట్ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.