ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. విజన్ 2020 అంటూ 2020 నాటికి ఐటీ రంగం సాధించబోయే పురోగతిని 2000 సంవత్సరంలోనే ఊహించిన విజనరీ లీడర్ ఆయన. Y2K దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగం గందరగోళంలో ఉన్నా సరే చంద్రబాబు మాత్రం ఐటీ రంగంలో భవిష్యత్తు ఉందని ఊహించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగోళ్లు సత్తా చాటుతున్నారంటే అది చంద్రబాబు చలవే. ఇది అతిశయోక్తి కాదు. వాస్తవం.
ఈ నేపథ్యంలోనే తాజాగా దావోస్ పర్యటన సందర్భంగా చంద్రబాబు విజన్ పై ప్రశంసలు కురిపించారు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్. చంద్రబాబు రేర్ అండ్ యునీక్ పీస్ అని లోకేశ్ కొనియాడారు. 20 ఏళ్ల తర్వాత ఏ రంగంలో అభివృద్ధి జరుగుతుందో ముందుగానే ఊహించగల విజనరీ చంద్రబాబు అని పొగడ్తలతో ముంచెత్తారు. విదేశాలలో సెటిల్ అయిన ఎన్నారైలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబుతో అనుబంధం ఉందని అన్నారు.