తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుకు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలని.. కోరా రు. విచారణకు సహకరించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే.. వాస్తవానికి ఈ కేసులో హరీష్ రావు, రాధాకిషన్ రావుల ప్రమేయం లేదని.. వారిపై విచారణ అవసరం లేదని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వారిని విచారణ కు పిలిచే అవకాశం లేదని అందరూ భావించారు.
కానీ, తర్వాత.. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వీటిపై విచారణ జరిపిన.. సుప్రీం కోర్టు.. ఈ నెల 5న తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో తాము జోక్యంచేసుకునేది లేదని.. పేర్కొంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హరీష్‌రావు, రాధాకిషన్‌రావులకు భారీ ఊరట లభించినట్టు అయింది. కానీ.. సుప్రీంకోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసి.. 13 రోజులు కూడా తిరగకుండానే తాజాగా సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వడం.. విచారణకు రావాలని పిలవడం ప్రాధాన్యం సంతరించు కుంది.
హరీష్‌రావుపై విచారణను నిలుపుదల చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతున్నాయా? లేక ఎత్తేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అలా కాకుండా.. వేరే కేసు నమో దు చేశారా? అనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని వాడుకుని హరీష్‌రావు.. ఎన్నికలను ప్రభావితం చేసే క్రమంలో తనకు అనుకూలంగా వినియోగించుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. దీనిపైనే సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ ఐఆర్‌ను సస్పెండ్ చేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఇప్పుడు ఏ రీజన్‌తో ఆయనకు నోటీసులు ఇచ్చారన్నది ప్రశ్నగా మారింది.