అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు.. పరిస్థితులను గమ నిస్తే.. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల సమస్యలు పట్టించుకునేవారన్న పేరుంది. అంతేకాదు.. అనంతపురం అర్బన్ ప్రధాన రహదారి విస్తరణకు ఆయన అలుపెరుగని కృషి చేశారు. దీనికి సొంత పార్టీ నాయకులే అడ్డు పడినా.. ఉద్యమించి సాధించారు.
దీంతోపాటు.. ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడిగా కూడా.. వైకుంఠం పేరు తెచ్చుకున్నారు. కానీ .. గత ఎన్నికల్లో ఆయనకు ఈ క్వేషన్ల ప్రాతిపదికన సీటు దక్కలేదు. ఇక, తొలిసారి విజయం దక్కించుకు న్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఆశలు ఉన్నా... అవి ఏడాది తిరగకుండానే పటాపంచలు అయిపో యాయి. ప్రధానంగా రెండు రకాలుగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. 1) పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టేశారు. 2) ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు.
ఈ రెండు విషయాల్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం గతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూ రంగా ఆయన వ్యవహరించారు. సొంత లాభం కోసం.. ఎక్కడా పనిచేయలేదన్న పేరు కూడా ఉంది. ప్రజ లకు పిలిస్తే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి ప్రజల నుంచే వైకుంఠం పేరు వినిపిస్తుండడం గమనార్హం. కానీ, ప్రభాకరచౌదరి మాత్రం గత ఎన్నికల్లో తనకు సీటు దక్కక పోవడం.. తర్వాత.. తన హవాకు ప్రస్తుత ఎమ్మెల్యే గండి కొట్టడంతో అలకబూనారు.
ఈ వ్యవహారంపై ఆయన పార్టీకి రెండు సార్లు ఫిర్యాదు చేసినా.. పార్టీ అధిష్టానం కూడా వేచి చూసే ధోరణిని అలంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైకుంఠం గడప దాటి బయటకు రావడం లేదు. కానీ, ఆయన మౌనం వీడి ప్రజల మధ్యకు వస్తే.. బాగుంటుందన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పుంజుకునే అవకాశం ఉందని.. ప్రజల నాడి కూడా ఆయనకు అనుకూలంగా ఉందని అనుచరులు చెబుతున్నారు. మరి వైకుంఠం ఏం చేస్తారో చూడాలి.