అమెరికాలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం..ఖండించిన బుచ్చి రాం ప్రసాద్

admin
Published by Admin — January 20, 2026 in Andhra, Nri
News Image

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు పవిత్రమైన ద్వారపాలకుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలను, హిందువుల మనోభావాలను ఆ ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. ద్వారపాలకుడు అంటే కేవలం రాయి, విగ్రహం కాదని, ఆలయ గౌరవానికి, ధర్మ రక్షణకు, తరతరాల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు.

అటువంటి పవిత్ర చిహ్నాన్ని ధ్వంసం చేయడం భక్తుల మనసును తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో నివసిస్తున్న హిందూ సోదరులు మాతృభూమి నుంచి దూరంగా ఉన్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాలను ప్రాణప్రదంగా కాపాడుకుంటూ జీవిస్తున్నారని అన్నారు. అటువంటి నేపథ్యంలో ఈ విధమైన విద్వేషపూరిత చర్యలు జరగడం అత్యంత బాధాకరం, ఆందోళనకరం అని చెప్పారు. ఈ ఘటనపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని అన్నారు.

అమెరికా ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలు తక్షణమే స్పందించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విదేశాల్లోని హిందూ ఆలయాల భద్రతను మరింత పటిష్టం చేయాలని అక్కడి ప్రభుత్వాలను కోరారు. విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చని, హిందువుల భక్తిని, విశ్వాసాన్ని, ధర్మాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని అన్నారు. దేవాలయాలు నిలిచినంతకాలం మన సంస్కృతి జీవిస్తూనే ఉంటుందని, ధర్మమే గెలుస్తుందని, సత్యమే నిలుస్తుందని చెప్పారు.

Tags
ap brahman corporation chairman buchi ramprasad condemned vandalism at temple north carolina
Recent Comments
Leave a Comment

Related News