డోర్ బెల్ మోగింది.. ఎదురుగా స్విగ్గీ టీషర్ట్, చేతిలో బ్యాగ్‌తో డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు. తీరా చూస్తే అతడు ఎవరో డెలివరీ బాయ్ కాదు.. సాక్షాత్తూ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఈ సీన్ చూసిన నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయారు. ఎమ్మెల్యే గారేంటి.. ఫుడ్ డెలివరీ చేయడం ఏంటి? అంటూ అవాక్కయ్యారు. ప్రస్తుతం బోడె ప్రసాద్ స్విగ్గీ బాయ్ అవతారం సోషల్ మీడియాలో ట్రెండ్ లో అవుతోంది.
సాధారణంగా నేతలు ఎన్నికల టైమ్‌లో మాత్రమే రోడ్లు ఊడ్చడం, చంటి పిల్లలకు స్నానాలు చేయించడం చూస్తుంటాం. కానీ బోడె ప్రసాద్ మాత్రం ఈ సోషల్ మీడియా కాలానికి తగ్గట్టుగా రూట్ మార్చారు. స్విగ్గీ డెలివరీ బాయ్ గెటప్‌లో నేరుగా జనం ఇళ్లకు వెళ్లారు. ``సార్.. మీరా? స్విగ్గీ బాయ్ అనుకున్నాం!`` అంటూ మహిళలు షాక్ తింటుంటే.. ఆయనేమో చాలా ప్రొఫెషనల్‌గా ఓటీపీ అడిగి మరీ ఫుడ్ పార్శిల్ అందజేశారు. ఈ వినూత్న ప్రచార శైలి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో గిగ్ వర్కర్స్ (డెలివరీ బాయ్స్) 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయాలనే టెన్షన్ గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో, డెలివరీ బాయ్స్ రోడ్ల మీద పడుతున్న కష్టాలు, కస్టమర్ల నుంచి వచ్చే ఒత్తిడి ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవడానికే తాను ఈ ఫీల్డ్ లోకి దిగానని బోడె ప్రసాద్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకునేందుకే ఈ ప్రయత్నమని ఆయన వివరించారు. మొత్తానికి స్విగ్గీ బాయ్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతోంది.