ఏపీ రాజకీయాల్లో రాజధాని చిచ్చు మరోసారి ఢిల్లీ వేదికగా రాజుకోబోతోంది. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏపీ పాలిటిక్స్‌లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై కేంద్రం నుంచి ఆశిస్తున్న అతిపెద్ద మద్దతు ఇదే కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వైఖరిపైనే ఉంది.
అమరావతి నిర్మాణంపై మొదటి నుంచి వ్యతిరేక గళం వినిపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో నేడు అత్యవసరంగా భేటీ అవుతున్నారు. గత ఐదేళ్లుగా `మూడు రాజధానుల` మంత్రం జపించిన జగన్, ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టే అమరావతి బిల్లును ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని గతంలో వాదించిన వైసీపీ, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అదే మాటపై నిలబడుతుందా? లేక రాష్ట్ర ప్రయోజనాల పేరుతో మౌనంగా ఉండిపోతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సాధారణంగా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కీలక బిల్లులకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే, అమరావతి అంశం పూర్తిగా రాజకీయంతో ముడిపడి ఉంది. ఒకవేళ బిల్లుకు మద్దతు ఇస్తే, గత ఐదేళ్లుగా తాము చేసిన మూడు రాజధానుల పోరాటం తప్పని ఒప్పుకున్నట్లు అవుతుంది. అలాగని వ్యతిరేకిస్తే, అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ముద్ర పడి రాజకీయంగా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే, అమరావతి విషయంలో ఒక మధ్యస్థ మార్గాన్ని జగన్ అన్వేషిస్తున్నట్లు సమాచారం.