టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు’ సినిమాలో ‘చిట్టి’ పాత్రతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు కొట్టించిన ఈ హైదరాబాద్ అమ్మాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించిందిచాలామంది హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఫరియా మాత్రం వెరీ ఓపెన్. తను ప్రేమిస్తున్న వ్యక్తి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడేనని క్లారిటీ ఇచ్చింది. అతడు టాలీవుడ్‌లో ఎదుగుతున్న ఒక యంగ్ కొరియోగ్రాఫర్. వీరిద్దరి మధ్య ఉన్న అభిరుచులు కలవడంతో, అది కాస్తా ప్రేమగా మారిందట.
ఫరియా అబ్దుల్లా ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే ఆమె ప్రేమిస్తున్న వ్యక్తి మాత్రం హిందూ అబ్బాయి. మతాల కంటే మనసులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ఫరియా, తమ బంధంలో అవగాహన, పరస్పర గౌరవం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో ఉన్న ఒత్తిళ్లను అర్థం చేసుకునే వ్యక్తి తోడుగా ఉండటం తన అదృష్టమని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
నటిగానే కాకుండా ఫరియా అబ్దుల్లాకు డ్యాన్స్, మ్యూజిక్, ర్యాప్ అంటే ప్రాణం. ఇటీవల విడుదలైన ‘మత్తు వదలరా 2’ లో ఆమె చేసిన ర్యాప్ సాంగ్ ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే. అయితే, తనలోని ఈ మల్టీ టాలెంట్‌ను వెలికి తీయడంలో తన ప్రియుడి పాత్ర చాలా ఉందని ఆమె వెల్లడించింది. ``మేము ఇద్దరం కేవలం ప్రేమికులం మాత్రమే కాదు.. ఒక టీమ్‌లా పని చేస్తాం. నేను ఈరోజు డ్యాన్స్‌లో గానీ, ర్యాప్‌లో గానీ ఇంత బాగా రాణిస్తున్నానంటే దానికి కారణం ఆయన ఇచ్చే ప్రోత్సాహమే.`` అని ఫరియా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతానికి తన కెరీర్, రిలేషన్‌షిప్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని, తమ బంధాన్ని కేవలం లవ్ అఫైర్ లా కాకుండా ఒక లైఫ్ పార్టనర్‌షిప్‌లా చూస్తానని ఆమె స్పష్టం చేసింది. మొత్తానికి చిట్టి తన మనసు దోచుకున్న వ్యక్తిని ఇండస్ట్రీ నుండే వెతుక్కుంది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆ యంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో? తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారు.