అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అధికారంలోకి వచ్చింది మొదలు నిలిచిపోయిన నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్న కూటమి సర్కార్.. ఇప్పుడు రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలకు ప్రతిఫలం దక్కే దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించడంతో, అమరావతి ప్రాంతంలో మళ్లీ కోలాహలం మొదలైంది.
రాజధాని రైతుల కలలను సాకారం చేస్తూ, సీఆర్డీఏ (CRDA) ఈరోజు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టింది. పూర్తి పారదర్శకత కోసం గతంలో అనుసరించిన ఈ-లాటరీ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంది. నేడు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు మొత్తం 135 ప్లాట్లు కేటాయించనున్నారు. సాంకేతికతను ఉపయోగించి, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఉండవల్లి మెట్ట భూముల రైతులకు కూడా ఈరోజు తీపి కబురు అందింది. ఉండవల్లికి చెందిన 201 మంది రైతులకు సుమారు 390 ప్లాట్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీరి కోసం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేకంగా ఈ-లాటరీ నిర్వహించనున్నారు. రాజధాని భూసేకరణలో కీలకమైన ఉండవల్లి రైతుల సమస్య పరిష్కారం కావడం, అమరావతి అభివృద్ధిలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. మొత్తానికి ఒకవైపు భవిష్యత్తు విస్తరణ కోసం భూసేకరణ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, మరోవైపు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటోంది. తాజా పరిణామాలతో అమరావతి గ్రామాల రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.