తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశం ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త మలుపు తీసుకుంటోంది. తాజాగా టిక్కెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను ఇక నుంచి సినిమా రిలీజ్‌కు కనీసం 90 రోజుల ముందే ప్రకటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే కొన్ని గంటల ముందు లేదా అర్ధరాత్రి పూట హడావుడిగా ధరల పెంపు జీవోలు రావడంపై న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పారదర్శకతను దెబ్బతీస్తాయని, సామాన్య ప్రేక్షకుడి సమాచార హక్కుకు భంగం కలిగిస్తాయని న్యాయస్థానం స్పష్టంగా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి. ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ వంటి భారీ సినిమాల రిలీజ్‌కు ముందు ధరలను పెంచుతూ అనుమతులు ఇవ్వడంపై న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టులో సవాల్ చేశారు. సినిమా షూటింగ్ పూర్తి కాకుండా, ఖర్చుల వివరాలు సరిగా తెలియకుండానే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ధరలు పెంచుతోందని న్యాయస్థానం ప్రశ్నించింది. జనవరి 9న ఇదే అంశంపై విచారణ జరుగుతుండగానే, ప్రభుత్వం 8వ తేదీనే రహస్యంగా ధరల పెంపు మెమో జారీ చేయడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సింగిల్ స్క్రీన్లలో యాభై రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో వంద రూపాయల అదనపు ధరల అనుమతిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటే తగిన సమయం ఉండాలని, అందుకే 90 రోజుల నిబంధన అవసరమని కోర్టు పేర్కొంది.
సినిమా థియేటర్లలో కేవలం టికెట్ ధరలే కాకుండా తినుబండారాల రేట్లు కూడా సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా మల్టీప్లెక్స్‌లలో వంద రూపాయలకు నీళ్ల సీసా, ఏడు వందల రూపాయలకు కాఫీ అమ్మడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా వినోదం అనేది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదని, ధరలు ఇలాగే పెంచుకుంటూ పోతే థియేటర్లు ఖాళీ అవుతాయని హెచ్చరించింది. కర్ణాటక హైకోర్టు గతంలో టికెట్ ధరలపై రెండు వందల రూపాయల పరిమితి విధించాలని సూచించిన సందర్భాలను కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. థియేటర్ల లోపల ఆహార పదార్థాల ధరలను నియంత్రించకపోతే సామాన్య ప్రేక్షకులు సినిమాకు దూరమయ్యే ప్రమాదం ఉందని న్యాయస్థానాలు ఇప్పటికే చాలాసార్లు తమ వైఖరిని స్పష్టం చేశాయి.
అయితే హైకోర్టు ఇచ్చిన 90 రోజుల నిబంధన ఆచరణలో ఎంతవరకు ? సాధ్యమనే సందేహాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ ఆలస్యం కావడం వల్ల విడుదల తేదీలు తరచుగా మారుతుంటాయి. సినిమా విడుదల కాకముందే మూడు నెలల ముందు ధరల పెంపు కోసం దరఖాస్తు చేసుకోవడం, అనుమతులు పొందడం సాంకేతికంగా కష్టమని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో భారీ చిత్రాల వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్తుందా లేక కొత్త విధానాన్ని అమలు చేస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా సినిమా వినోదాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉంచాలనే న్యాయస్థానాల ప్రయత్నం హర్షణీయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.