రాజకీయాల్లో వారసులు రావడం సహజం, కానీ ఆ వారసత్వపు నీడను దాటుకుని తనకంటూ ఒక సొంత ముద్ర వేసుకోవడం చాలా కష్టం. నారా లోకేష్ ప్రయాణం సరిగ్గా ఇలాంటిదే. ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డగా, ప్రత్యర్థుల ఎగతాళికి వేదికగా నిలిచిన లోకేష్.. నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గేమ్ ఛేంజర్ గా ఎదిగారు. విమర్శలనే ఇటుకలతో తన విజయ సౌధాన్ని నిర్మించుకున్న ఆయన ప్రయాణం నేటి యువతకు ఒక కేస్ స్టడీ.
రాజకీయ ఆరంగేట్రం చేసిన తొలి రోజుల్లో లోకేష్ ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యర్థులు ప్రధానంగా పప్పు అని సంబోధిస్తూ విమర్శలు చేసేవారు. ఆయన ప్రసంగాల్లో దొర్లిన కొన్ని మాటల పొరపాట్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యేవి. ప్రత్యర్థులు పెట్టిన ముద్రలు, వ్యక్తిగత దూషణలు ఆయనను కుంగదీస్తాయని అందరూ భావించారు. కానీ, లోకేష్ మౌనంగానే తన పనిని తాను చేసుకుంటూ వెళ్లారు. అటు ఎన్టీఆర్ చరిష్మా, ఇటు చంద్రబాబు నాయుడి అపార అనుభవం.. ఈ రెండింటి మధ్య తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎంతగానో శ్రమించారు. 2017లో ఎమ్మెల్సీగా గెలిచి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన పనితీరుకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినా, గ్రౌండ్ లెవల్లో ఆయనకు ఒక మాస్ లీడర్ ఇమేజ్ రాలేదు.
కెరీర్లోనే అతిపెద్ద ఎదురుదెబ్బ.. మంగళగిరి ఓటమి!
2019 ఎన్నికలు లోకేష్ రాజకీయ జీవితంలో ఒక చీకటి అధ్యాయం. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోవడం ఆయనను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ, ఆ ఓటమే ఆయనను ఒక యోధుడిగా మార్చింది. ఆయనలో అసలైన నాయకుడిని మేల్కొల్పింది. 2019 ఓటమి తర్వాత లోకేష్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. అధిక బరువును తగ్గించుకుని పూర్తి ఫిట్‌గా మారారు. తన మాట తీరును మార్చుకుని, ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడం నేర్చుకున్నారు. ఏసీ రూములకే పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు వెళ్తేనే నాయకత్వం సిద్ధిస్తుందని ఆయన గ్రహించారు. ఈ క్రమంలోనే ఆయన చేపట్టిన 4000 కిలోమీటర్ల "యువగళం" పాదయాత్ర లోకేష్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రజలతో ఆయనకున్న దూరాన్ని చెరిపేసింది. ఎండనక, వాననక సామాన్యుల సమస్యలు వింటూ ఆయన ఎదిగిన తీరు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
గతంలో ఎక్కడైతే ఓడిపోయారో, అదే మంగళగిరిలో 2024 ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. ఒక నాయకుడిగా తనపై ఉన్న విమర్శలన్నింటినీ ఈ ఒక్క విజయంతో తుడిచిపెట్టేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ కేబినెట్లో కీలకమైన ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. పాత లోకేష్‌కు భిన్నంగా, ఒక స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడిగా దూసుకుపోతున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి రప్పించడంపై ఆయన చూపిస్తున్న చొరవ ఆయన పరిణతికి నిదర్శనం.