సంక్రాంతి రేసు అంటేనే పెద్ద సినిమాల జాతర. బాక్సాఫీస్ వద్ద అగ్ర హీరోల పోరు నడుస్తున్న వేళ, ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా బరిలోకి దిగింది ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో సంయుక్త మీన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత హిట్టు కొట్టడంతో ఫుల్ జోష్‌లో ఉన్న హీరో శర్వా.. తన నిర్మాతకు ఎవరూ ఊహించని విధంగా ఒక అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే హీరోలు తమ రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. కానీ శర్వానంద్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన నిర్మాత అనిల్ సుంకరపై ఉన్న గౌరవంతో, నెక్స్ట్ సినిమాకు రూపాయి కూడా అడగనని ప్రామిస్ చేశారు. అనిల్ గారు మళ్లీ పెద్ద సినిమాలు చేసే వరకు.. ఆయనతో తాను చేసే తదుపరి సినిమాలకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోనని శర్వానంద్ ప్రకటించారు.
ఈ విజయం వెనుక ఉన్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ శర్వానంద్ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ``మేము గత ఏడేళ్లుగా ఒక సరైన హిట్ కోసం కష్టపడుతున్నాం. ఒక్క హిట్టు వాల్యూ ఏంటో మాకు తెలుసు. ఆ విజయాన్ని మీరు ఈ రోజు మాకు అందించారు. అనిల్ సుంకర గారిని కేవలం నిర్మాతగానే కాకుండా, నా అన్నలా భావిస్తున్నాను. మా మధ్య ఉన్న ఈ అనుబంధం కేవలం థ్యాంక్స్‌తో సరిపోయేది కాదు. హీరో, ప్రొడ్యూసర్ కలిసుంటే ఏమవుతుందో రాబోయే రోజుల్లో చూపిస్తాం`` అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.