రేవంత్ వెంట చిరు.. బాబు వెంట పవన్ ఎందుకు లేరు?

admin
Published by Admin — January 24, 2026 in Politics, Andhra
News Image

దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వెంట మెగాస్టార్ చిరంజీవిని తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు బృందంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెట్టుబడుల వేటలో ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు, నారా లోకేష్, టీజీ భరత్ వంటి కీలక నేతలు పాల్గొంటున్నప్పటికీ.. కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పవన్ కళ్యాణ్ ఎందుకు లేరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక‌వైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని తన వెంట తీసుకెళ్లడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యవహరించారు. సినిమా పరిశ్రమ మద్దతుతో పాటు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేలా ప్లాన్ చేశారు.

ఇదే సమయంలో దావోస్ ప‌ర్య‌ట‌న‌లో బాబు ప‌క్క‌న పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్ అయ్యారనేది జనసైనికులను అసంతృప్తికి గురి చేస్తోంది. గతంలో కూడా ఇటువంటి పర్యటనలకు పవన్ వెళ్లకపోవడంతో, చంద్రబాబు వ్యూహాత్మకంగానే పవన్‌ను రాష్ట్ర పనులకే పరిమితం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ విదేశీ పర్యటనల కంటే క్షేత్రస్థాయి రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. బహుశా ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల దృష్ట్యా ఆయనే వెనక్కి తగ్గి ఉండవచ్చని కొందరు అంటున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలు (గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పంచాయతీ రాజ్) నేరుగా పారిశ్రామిక పెట్టుబడులతో ముడిపడి లేవు. ఐటీ, పరిశ్రమల శాఖలు చూస్తున్న లోకేష్, టీజీ భరత్ వెళ్లడం సహజమే అని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అయితే, పవన్ కళ్యాణ్ కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, ఆయన రాష్ట్రానికి ఒక భారీ క్రేజ్ ఉన్న నాయకుడు. అటు సినిమా గ్లామర్, ఇటు రాజకీయ పవర్ ఉన్న పవన్ వెళ్తే ఏపీకి మైలేజ్ పెరిగేదన్నది జనసేన శ్రేణుల వాదన.

Tags
Pawan Kalyan Chandrababu Naidu Chiranjeevi Revanth Reddy Davos 2026 Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News