మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ `మన శంకరవరప్రసాద్‌గారు` చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన న్యాయ వివాదం ముసురుకుంది. సినిమా హిట్టా ఫట్టా అనే చర్చ పక్కన పెడితే, టికెట్ ధరల పెంపు ద్వారా వసూలైన భారీ మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు, నయనతార జంటగా నటించిన అవుట్ అండ్ అవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీనే మన శంకరవరప్రసాద్‌గారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
అయితే సినిమా ఘనవిజయం సాధించిన ఆనందంలో చిత్ర యూనిట్ ఉండగానే, టికెట్ ధరల రూపంలో ఒక భారీ షాక్ తగిలింది. మూవీ రిలీజ్ సమయంలో ప్రభుత్వం ప్రత్యేక షోల కోసం అనుమతినిస్తూనే, టికెట్ ధరలను భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం.. స్పెషల్ షో టికెట్ ధరను ఏకంగా రూ. 600గా నిర్ణయించడమే కాకుండా, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా వసూలు చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. ఈ అదనపు పెంపు ద్వారా నిర్మాతలకు, పంపిణీదారులకు కోట్లాది రూపాయల లాభం చేకూరింది.
ప్రభుత్వం ఇచ్చిన ఈ అనుమతులు నిబంధనలకు విరుద్ధమని, సామాన్య ప్రేక్షకుడిపై భారం మోపడమేనని న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కి హోంశాఖ ఈ మెమో జారీ చేసిందని ఆయన వాదించారు. ఈ అదనపు ధరల ద్వారా వసూలైన సుమారు రూ. 42 కోట్లను వెంటనే రికవరీ చేయాలని కోర్టును కోరారు. పిటిషనర్ వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఆ రూ. 42 కోట్ల వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు జీఎస్టీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతానికి హైకోర్టు ఈ కేసులో సంబంధిత ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఒకవేళ విచారణలో ఈ ధరల పెంపు అక్రమమని తేలితే, వసూలైన ఆ రూ. 42 కోట్లను వెనక్కి ఇచ్చేయాలా? లేదా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలా? అనే ఉత్కంఠ నెలకొంది.