స్టార్టప్‌లకు గుడ్ న్యూస్.. టీ-హబ్‌పై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్!

admin
Published by Admin — January 24, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ గడ్డపై ఆవిష్కరణలకు చిరునామాగా, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన `టీ-హబ్` విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా టీ-హబ్ ప్రాంగణంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తారన్న ప్రచారంపై నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. స్టార్టప్‌ల కోసమే కేటాయించిన ఈ ఐకానిక్ భవనంలోకి ఇతర ప్రభుత్వ శాఖలను అనుమతించబోమని స్పష్టం చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో భాగంగా, రాయదుర్గంలోని టీ-హబ్‌లో ఖాళీగా ఉన్న సుమారు 60 వేల చదరపు అడుగుల స్థలాన్ని వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా భావించారు. అయితే, ఈ ప్రతిపాదన బయటకు రాగానే ఐటీ వర్గాల నుంచి, ముఖ్యంగా స్టార్టప్ నిర్వాహకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ ఏర్పాటైతే, టీ-హబ్ తన ప్రత్యేకతను కోల్పోతుందని, అది కేవలం ఒక సాధారణ ప్రభుత్వ భవనంగా మారిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందారు.

ప్రస్తుతం పెట్టుబడుల వేటలో అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం చేరగానే ఆయన వెంటనే స్పందించారు. టీ-హబ్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ``టీ-హబ్ అనేది కేవలం ఒక భవనం కాదు, అది వేలాది మంది యువ పారిశ్రామికవేత్తల కల. దాని ప్రాధాన్యతను, స్వరూపాన్ని దెబ్బతీసేలా ఇతర కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేయవద్దు`` అని సీఎం స్పష్టంగా ఆదేశించారు. దీంతో ఐటీ నిపుణులు, స్టార్టప్ ఫౌండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags
T-Hub CM Revanth Reddy Hyderabad Startups IT Telangana Telangana Govt
Recent Comments
Leave a Comment

Related News