ఏపీ రాజధాని అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేసేలా కూటమి ప్రభుత్వం కీలక పని పూర్తి చేసింది. తొలి విడతలో రాజధాని భూములు ఇచ్చిన రైతులకు నిబంధనల ప్రకారం.. వారికి ఇస్తామన్న ఫ్లాట్లను గతంలోనే కేటాయించింది. అయితే.. ఆయా స్థలాలకు వీధిపోట్లు, రోడ్డు శూలలు ఉన్నాయని.. వాస్తు ప్రకారం కూడా సరిగా లేవని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో గత నెలలోనే వారికి అనుకూలమైనస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భూములుఇచ్చిన రైతులకు వారికి నచ్చిన విధంగా..వారు మెచ్చే విధంగా స్థలాలు కేటాయించారు.
రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా 115 ప్లాట్ల కేటాయించారు. నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా ప్లాట్లను కేటాయించి నట్టు ప్రభుత్వం తెలిపింది. రోడ్లు శూల లేని, ల్యాండ్ అక్విజిషన్ స్థలంలో లేని ప్లాట్లు మాత్రమే కేటాయించారు. అదేసమయంలో
పల్లపు ప్రాంతాలు, సమాధుల సమీపంలో ప్లాట్లు కేటాయించలేదని సర్కారు స్పష్టం చేసింది. రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్ రూల్స్ ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని తెలిపింది. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పూర్తి పారదర్శకంగా నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ ప్రక్రియ పూర్తి చేసారు.
.మొత్తం 16 సీఆర్డీఏ యూనిట్ల పరిధిలోని గ్రామాలకు సంబంధించి 145 ప్లాట్లు కేటాయించారు..అయితే వీటిలో 15 ప్లాట్లకు సంబంధించిన కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ప్లాట్ల కేటాయింపు వాయిదా వేయాలని కోరారు...వీటితో పాటు శుక్రవారం ఉదయం లాటరీ ప్రక్రియ చేపట్టి మొత్తం 115 ప్లాట్లను లాటరీ ద్వారా రైతులకు కేటాయించారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఎక్కడా రోడ్డు శూల లేకుండా...అలాగే సీఆర్డీఏకు భూమి ఇవ్వని రైతుల ప్లాట్లలో ఎక్కడా కేటాయించలేదని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేసారు.
అయితే కొంతమంది దక్షిణపు ముఖం ఉన్న ప్లాట్లను తీసుకోవడానికి అంగీకరించ లేదు. కానీ, దక్షిణపు ముఖం ప్లాట్లు రోడ్డు శూల ప్లాట్లుగా పరిగణించకూడదని, గతంలో కూడా ఇదే విధంగా ప్లాట్లు కేటాయించామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితిలో కొన్ని ప్లాట్లు పల్లపు ప్రాంతంలో ఉన్నాయని, సమాధులు దగ్గరగా ఉన్న ప్రాంతంలో కేటాయిస్తున్నారని కొంతమంది రైతులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని అధికారులు చెప్పారు. ఇలాంటి ప్లాట్లను రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్ నిబంధనల ప్రకారం పూర్తిగా అభివృద్ది చేసి ఇస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయింపు ఇదీ..
కురగల్లు - - 5
వెలగపూడి - 10
మందడం - -15
నిడమర్రు - - 58
పెనుమాక - 6
నెక్కల్లు - 1
అనంతవరం -1
నేలపాడు - 2
దొండపాడు -1
లింగాయపాలెం -6
మల్కాపురం - 10