ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక ఓటమి తర్వాత కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీకి, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే సెగ తగులుతోంది. కనీసం ప్రతిపక్ష హోదా లేని సభకు వెళ్లకూడదన్న జగన్ నిర్ణయం, ఇప్పుడు ఆ పార్టీ ఉనికినే దెబ్బతీసేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోవడం లేదు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వెళ్తాం.. ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తేనే అడుగుపెడతాం అనే భీష్మ ప్రతిజ్ఞతో ఆయన సభకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈ పంతం ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంది. కేవలం 11 మంది సభ్యులే ఉన్న పార్టీలో, సభకు వెళ్లకపోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని సీనియర్లు నెత్తీనోరు బాదుకుంటున్నా జగన్ మాత్రం వినడం లేదనే చర్చ నడుస్తోంది. సభకు హాజరు కాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వైసీపీ నేతలను మరింత తీవ్రంగా బాధిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ కూడా రంగంలోకి దిగడంతో, ఎక్కడ తమపై అనర్హత వేటు పడుతుందోనన్న భయం ఎమ్మెల్యేలలో మొదలైంది.
జగన్ మాట వింటే పదవి ఊడేలా ఉంది.. వినకపోతే అధినేత ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ ఊగిసలాటలో ఉండటం కంటే రాజీనామా చేయడమే మేలని ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకరు కడప జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే కాగా, మరొకరు ప్రకాశం జిల్లాకు చెందిన నేత అని ప్రచారం జరుగుతోంది. సభకు వెళ్లాలని వీరు పట్టుబడుతున్నా, జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. గౌరవం లేని చోట పదవిలో కొనసాగడం కంటే, ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమమని వారు భావిస్తున్నారట. మరి ఒకవేళ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేస్తే, అది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.