రాహుల్ కాం రగ్రెస్‌కు భారం.. కాంగ్రెస్ ఈ భూమికే భారం అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహారం తయారైంది. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపి.. స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్రపోషించి.. దరిదాపుగా 58 ఏళ్లు ఈ దేశాన్ని ఏలిన ఆ పార్టీ.. మిడిమిడి జ్ఞానుల అడ్డాగా తయారైంది. ప్రధానంగా ఆ పార్టీ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. రానురాను ఆ పార్టీకి భారంగా మారిపోయారు.
ఆయన వివాదాస్పద ప్రకటనలు... ప్రజలను సైతం తప్పుదోవ పట్టించే చర్యలతో ఆ పార్టీ ప్రతి ఎన్నికలో ఓడిపోతూ వస్తోంది. పైగా మిత్రపక్షాలు సైతం ఆయన తీరుతో దెబ్బ తింటున్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్‌సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన.. బిహార్‌లో ఆర్‌జేడీ, కమ్యూనిస్టు పార్టీలు లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఆ పార్టీతో జట్టుకట్టడానికి మిత్రపక్షం డీఎంకే ముందూ వెనుకాడుతున్నట్లు సమాచారం అందుతోంది.
బెంగాల్లో సీపీఎం పరిస్థితీ ఇంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిపోరుతో టీఎంసీని ఎదుర్కోవడం కమ్యూనిస్టులకు సాధ్యం కాదు. కాంగ్రెస్‌తో జట్టుకడితే కమ్యూనిస్టుల ఓట్లు దానికి పడుతున్నాయి కానీ.. ఆ పార్టీ ఓట్లు కమ్యూనిస్టులకు మళ్లడం లేదు. అసోంలో ముస్లిం పార్టీ అయిన ఆలిండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) కూడా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ నాయకత్వం అంతర్గతంగా చర్చించుకోవడం లేదు.
ఎంతో అనుభవజ్ఞుడైన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. రాహుల్‌కు నచ్చజెప్పే సామర్థ్యం ఆయనకు లేదు. అసలా ఆలోచనే ఆయనకు రాదు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు మాత్రమే వచ్చాయి. రాహుల్‌కు ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. ఆయనకు ప్రధాని పదవి వచ్చినంత సంబరంగా ఉంది (2014, 19ల్లో ప్రతిపక్ష పార్టీ హోదాకు సరిపడా సీట్లు రాకపోవడంతో వరుసగా ఖర్గే, అధీర్ రంజన్ చౌధురిని సీఎల్పీ నాయకులుగా నియమించారు).
తాను చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ వల్లే పార్టీకి 99 సీట్లు వచ్చాయని ఆయన, ఆయన అనుయాయులు అప్పట్లో ఊదరగొట్టారు. మరి మిగతా సీట్లలో ఓటమి సంగతేంటి? అక్కడెందుకు ఓడిపోయారంటే కారణాలు వెతుక్కోవడానికి ఏడాది పట్టింది. ఏడాది తర్వాత తప్పుడు డాక్యుమెంట్లు చూపి.. ఓట్ల చోరీ జరిగిందని వితండ వాదన లేవనెత్తారు. కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలోని మహదేవ్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓట్ల చోరీ జరిగిందని.. కాంగ్రెస్ అందుకే అక్కడ ఓడిపోయిందన్నారు.
నిజానికి 2009 నుంచి ఈ ఎంపీ సీటును కాంగ్రెస్ గెలిచింది లేదు. దీని పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 చోట్ల, బీజేపీ మూడు చోట్ల గెలిచాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలూ చెరో నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనబరిచాయి. మహదేవ్‌పురాలో బీజేపీ ఎమ్మెల్యేనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి ఇక్కడ 1.14 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిన మాట నిజం.
అంతమాత్రానికే ఇక్కడ ఓట్ల దొంగతనం జరిగినట్లవుతుందా..? ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే గాంధీనగర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ మంత్రి దినేశ్ గుండూరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా బీజేపీ మెజారిటీ సాధించింది. దీని గురించి మాట్లాడడం మానేసి మహదేవ్‌పురాలో దొంగ ఓట్లు చేర్చారు.. వారంతా బీజేపీకే వేశారని రాహుల్ ఆరోపిస్తున్నారు.
మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చిన నాలుగు చోట్ల కూడా ఓట్ల చోరీ జరిగిందని అనగలరా? అదీగాక లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నదెవరు? కాంగ్రెస్ పార్టీయే కదా! పోలింగ్ బూత్‌లలోని కాంగ్రెస్ ఏజెంట్లకు తెలియకుండా ఓట్ల చోరీ ఎలా జరుగుతుంది? దొంగ ఓట్లు వేస్తుంటే.. ఓటర్లను జాబితాలను తొలగిస్తే అధికార పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు కళ్లు మూసుకున్నారా? ఈ ప్రశ్నలు అడిగితే.. జర్నలిస్టులపై ఆర్‌ఎస్‌ఎస్, మోదీ ఏజెంట్లు అన్న ముద్రవేసి వారి నోరు మూయించాలని రాహుల్ చూస్తున్నారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఇలాంటి నేతలను ఇంతవరకు చూసి ఎరుగమని కాంగ్రెస్ సీనియర్లు వాపోతున్నారు. ప్రజలను ఆకట్టుకునే మార్గాలు చూడకుండా.. ప్రత్యర్థి దొంగచాటుగా గెలిచారని ఆరోపించడంలో అర్థముందా అని నిలదీస్తున్నారు. పైగా తప్పుడు ఆరోపణలతో ఆయనతో పాటు యావత్ పార్టీ నవ్వులపాలవుతోందని... పార్టీ పాలిట రాహుల్ భస్మాసురుడిలా తయారయ్యారని అంతర్గతంగా వాపోతున్నారు.
బిహార్లో ఏం జరిగింది..?
వాస్తవానికి బిహార్లో నితీశ్‌కుమార్ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు పేర్కొన్నాయి. ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఇక తానే సీఎంనని ప్రకటించుకున్నారు. 20 ఏళ్లుగా అప్రతిహతంగా సీఎంగా కొనసాగుతున్న నితీశ్.. రాజకీయానుభవం అధికంగా ఉన్న నేత. లాలూకు సహాధ్యాయి కూడా. ఇవే తన చివరి ఎన్నికలని ఆయన అంతర్గతంగా స్పష్టంచేశారు.
బీజేపీ కూడా ఆయన సాయం లేకుండా గెలవడం కష్టం. అందుకే ఆయన్ను ముందు పెట్టుకుని.. సోషల్ ఇంజనీరింగ్ చేసింది. దళితుల్లో గట్టి పట్టున్న ఎల్‌జేపీ (రాంవిలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్, హిందూస్థాన్ అవామ్ మోర్చా నాయకుడు, మరో కేంద్ర మంత్రి జితన్‌రాం మంఝీ, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా నేత ఉపేంద్ర కుశ్వాహాలను కూడగట్టుకుని ఎన్నికలకు వెళ్లింది.
అటు ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌లో ఐకమత్యం లేదు. కనీసం 24 స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీలకు దిగారు. అంటే ఒకరిపై మరొకరు పోటీచేసుకున్నారు. ఇక ప్రజలు వారినెలా విశ్వసిస్తారు? ఇక్కడ కూడా రాహుల్ శల్య సారథ్యం చేశారు. బిహార్లో ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టింది. బంగ్లాదేశ్, నేపాల్ చొరబాటుదారులను ఆర్‌జేడీ, కమ్యూనిస్టులు కొన్ని ప్రాంతాల్లో ఓటర్లుగా చేర్చారు.
ఇది ఈసీ దృష్టికి రావడంతో ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు నడుం బిగించింది. దీనిని వ్యతిరేకిస్తూ రాహుల్ ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు కోర్టుకెళ్లినా సుప్రీంకోర్టు ఈసీనే సమర్థించింది. డూప్లికేట్ ఓటర్లు, చనిపోయున ఓటర్లు, వలసవెళ్లినవారు సహా 64 లక్షల మంది ఓటర్లను కమిషన్ తొలగించింది. మరో 26 లక్షల మందిని ఓటర్లుగా చేర్చింది. అంతే.. బతికున్నవారిని కూడా చనిపోయినట్లు చూపించి ఓట్లు తొలగించారని రాహుల్ ప్రచారం చేశారు.
ఫ్యాక్ట్ చెక్‌లో ఆ బతికున్నవారి ఓట్లు చెక్కుచెదరకుండా ఉన్నాయని తేలింది. ప్రధాని పీఠమెక్కాల్సిన రాహుల్ స్థాయి వ్యక్తి అబద్ధాలాడితే జనం ఊరుకుంటారా? బిహార్లోని మొత్తం 243 స్థానాలకు గాను ఎన్‌డీఏ ఏకంగా 202 చోట్ల విజయం సాధించింది. విపక్ష గఠ్‌బంధన్ 35 స్థానాలకే కుదేలైంది. ఇందులో 25 ఆర్‌జేడీ గెలుచుకున్నవే. 61 చోట్ల బరిలోకి దిగిన కాంగ్రెస్ ముక్కుతూ మూలుగుతూ కేవలం 6 స్థానాల్లో విజయం సాధించింది.
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 5 చోట్ల గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్‌కు బలం లేదని ముందే తేలిపోయింది. అయినా అధిక స్థానాల కోసం పట్టుబట్టింది. లాలూకు ఇష్టం లేకపోయినా తేజస్వి యాదవ్ ఒత్తిడి తెచ్చి అంగీకరింపజేశారు. ఇంతాచేసి.. తేజస్విని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. పొత్తు పెటాకులయ్యే ప్రమాదం ఏర్పడడంతో చివరి నిమిషంలో అంగీకరించారు.
నితీశ్‌కు అనారోగ్యంగా ఉందని.. ఎన్‌డీఏ గెలిచినా ఆయన్ను సీఎం చేయరని తేజస్వి, రాహుల్ చేసిన ప్రచారాన్ని ఎవరూ విశ్వసించలేదు. ఎందుకంటే అటు ప్రధాని మోదీ, అమిత్‌షా, ఎన్‌డీఏ నేతలంతా నితీశ్‌కుమారే సీఎం అవుతారని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. దీనికితోడు మహిళలు ఆయనకు కొండంత అండగా నిలిచారు. 20ఏళ్లుగా వారి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
పైగా ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది మహిళలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. వెంటనే అమలుకు కూడా శ్రీకారం చుట్టారు. వారందరికీ మొదటి వాయిదాలో రూ.10 వేల చొప్పున ఖాతాల్లో జమచేశారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో 60 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బు పడడంతో మహిళలు ఎన్‌డీఏకి ఓట్టేశారు. దీనివల్లే మళ్లీ అక్కడ భారీ విజయం సాధించింది. అయినా ఎస్‌ఐఆర్‌తో భారీగా ఓట్లు తొలగించారని.. దానివల్లే ఎన్‌డీఏ గెలిచిందని రాహుల్ ప్రచారం చేస్తున్నారు.
జనంలో చులకన..
చుట్టూ వందిమాగధులను పెట్టుకుని.. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ అనే ఒకేఒక్క వ్యక్తిపై అలవిమాలిన కోపం, అక్కర్లేని అసూయాద్వేషాలు ప్రదర్శిస్తూ.. ప్రజల్లో రాహుల్ చులకనైపోతున్నారు. మోదీని దూషించే క్రమంలో విదేశీ వేదికలపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా వెనుకాడడం లేదు. విదేశాలకు వెళ్లి.. దేశ ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టును, ఇతర రాజ్యాంగ సంస్థలను అవమానించేలా మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారింది.
ప్రజాస్వామ్యాన్ని అమితంగా ద్వేషించే చైనా, పాకిస్థాన్ పాలకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత సైన్యం పాకిస్థాన్, పీవోకేల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే.. అందుకు ఆధారాలేంటని అడిగారు. తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి భారత్‌కు చెందిన ఆరు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ పాలకులు అబద్ధాలు ప్రకటిస్తే.. అదే నిజమంటూ మన సైన్యం నిజాలు చెప్పడం లేదంటారు.
ఆ ఆపరేషన్‌లో పాక్‌కు చైనా విక్రయించిన ఫైటర్ జెట్లు ఆరింటిని బ్రహ్మోస్ క్షిపణులు ధ్వంసం చేశాయి. దీని నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడానికి చైనా.. మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిన రఫేల్ యుద్ధవిమానాలు కూలిపోయాయని దుష్ర్పాపగాండాకు తెరతీస్తే... అది కూడా సత్యమేనని రాహుల్ అంటారు. ఒక్క రఫేల్ కూడా కూలలేదని ఫ్రెంచ్ తయారీసంస్థ దసాల్ట్ ప్రకటించినా చైనా చెప్పిందే ఆయనకు వేదం. ఆపరేషన్ సిందూర్‌తో మనం ఏమీ సాధించలేదంటారు.
ఓపక్క మన యుద్ధవిమానాలు పాక్ వైమానిక స్థావరాలను కకావికలం చేస్తే.. ఇప్పటికీ వాటిని బాగుచేసుకోవడానికి పాక్ నానా తంటాలు పడుతుంటే.. రాహుల్‌కు అది కనబడదు. 2009లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఇప్పటికీ ఓనమాలు నేర్చుకోలేదు. తన పార్టీ ఎందుకు ఓడిపోతోందో కనీసం ఆత్మశోధన చేసుకోవడం లేదు.
ప్రజలకు చేరువ కాలేకనే వరుస ఓటములు ఎదురవుతున్నాయని ఆయనకు తెలుసో లేదో.. ఒకవేళ తెలిసినా నటిస్తున్నారో దేశ ప్రజలకు అర్థం కావడం లేదు. ఓట్ల చోరీ అని వింత ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల కమిషన్, బీజేపీ కుమ్మక్కయితే బీజేపీ గత ఏడాది ఎన్నికల్లో ఎందుకు సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది? జార్ఖండ్‌లో ఎందుకు ఓడిపోయింది? వీటికి ఆయన వద్ద సమాధానం ఉండదు.
2014లో కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయని.. అయినా ఎందుకు ఓడిపోయామని అమాయకంగా అడుగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలే ప్రామాణికమైతే 2004లో వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ఎలా ఓడిపోయింది..? 2009లో మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ రెండోసారి ఎలా గెలిచింది..? హరియాణా, మహారాష్ట్రల్లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న రూలేమైనా ఉందా?