సూపర్ జీఎస్‌టీ సూపర్ సేవింగ్స్’ అంటూ ప్రభుత్వం నెల రోజుల పాటు వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన హడావుడి కేవలం ప్రచారార్భాటంగా మిగిలింది. అనేక వస్తువులను సామాన్యులకు ఎలాంటి ప్రయోజనమూ అందడం లేదు. దసరా నుంచి దీపావళి వరకు 65,000 అవగాహన సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వం జీఎస్‌టీ సంబరాలు కూడా నిర్వహించింది.
శ్లాబుల తగ్గింపుతో ఆదాయం తగ్గిపోయి రాష్ట్ర ఖజానాకు రూ.8,000 కోట్ల నష్టమైనా పర్లేదు.. ఆ మేరకు ప్రజలకు ఆ డబ్బు ఆదా అవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ వేల మీటింగులు, వందల కోట్ల ఖర్చు, అన్ని రోజుల సంబరాలు సామాన్యులకు సూపర్ జీఎస్‌టీ ప్రయోజనాలు కల్పించడంలో విఫలమయ్యాయి. సూపర్ జీఎస్‌టీ అమల్లోకి వచ్చినా సేవింగ్స్ మాత్రం ఎక్కడా కనబడడం లేదు.
ప్రజలు ప్రతి రోజూ ఉపయోగించే మందులు, నిత్యావసరాలపై తగ్గిన పన్ను ప్రయోజనాలు రిటైల్ మార్కెట్లోనే ఆగిపోతున్నాయి. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో ఈ దోపిడీ ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు చోట్ల మినహాయిస్తే ఎక్కడా కూడా పాత, కొత్త ధరల బోర్డులు లేవు. రేట్లు తగ్గించరా అని ప్రజలెవరైనా అడిగితే పాతస్టాక్ అని, పరిమాణం పెరిగిందని, ఈ వస్తువుపై తగ్గింపు లేదంటూ మోసం చేస్తున్నారు. ఎలక్ర్టానిక్స్, కార్డు, బైకుల షోరూములు, డీమార్ట్, మోర్, రిలయన్స్ లాంటి జాతీయస్థాయి సూపర్‌మార్కెట్లలో తప్ప ఎక్కడా జీఎస్‌టీ తగ్గింపు రేట్లు ప్రజలకు అందడం లేదు.
నిత్యావసరాలు, మెడిసిన్స్ ధరలు మండుతుండడంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్‌టీ శ్లాబులను రెండుకు కుదించింది. గతంలో 5, 12, 18, 28 శాతం శ్లాబులుండేవి. వాటిలో 5 శాతం శ్లాబులో ఉన్న చాలా వస్తువులపై పన్ను తీసేసింది. 12 శాతం పన్ను పరిధిలోని చాలా వస్తువులను ఐదు శాతానికి తీసుకొచ్చింది. 28 శాతం శ్లాబులోవి 18 శాతానికి వచ్చాయి. 28 శాతం పన్ను రద్దయింది.
అంటే ప్రస్తుతం 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉన్నాయి. కానీ 5 శాతం ఎక్కడా అమలు కావడం లేదు. పాత శ్లాబుల ప్రకారమే రిటైలర్లు విక్రయాలు సాగిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యమైపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే పరిమితం కాలేదు. దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది. ఏపీవ్యాప్తంగా ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపుల్లో తగ్గిన జీఎస్‌టీ రేట్లు అమలు కావడం లేదు. డాక్టర్ రాసిన మందులకు జీఎస్‌టీ తగ్గింపు వర్తించదని ఫార్మసిస్టులు చెబుతున్నారు. బయటి మెడికల్ షాపుల వాళ్లు ఇప్పటికే 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని అంటున్నారు తప్ప రేట్లు తగ్గించడం లేదు.
కేన్సర్, జన్యుసంబంధిత, అరుదైన వ్యాధులు, గుండె జబ్సులకు వినియోగించే 36 ప్రాణాధార ఔషధాలపై పన్ను పూర్తిగా తొలగించారు. వైద్యం కోసం ఉపయోగించే బ్యాండేజ్, గాజ్, డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకో మీటర్లపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. మరెన్నో ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గించారు. కానీ ఆస్పత్రి బిల్లుల్లో గానీ, మందుల బిల్లుల్లో గానీ ఈ తగ్గింపు కనిపించడం లేదు. దేశంలో వైద్యసేవల ఖర్చును తగ్గించేందుకే ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించింది.
ఈ ప్రయోజనాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అందుకుంటున్నప్పటికీ.. వాటిని ప్రజలకు పంచడానికి మాత్రం వారికి మనసొప్పడం లేదు. సూపర్ జీఎస్‌టీ సెప్టెంబరు 22న అమల్లోకి వచ్చింది. రెండు నెలలు దాటిపోయినా తగ్గిన రేట్లు అమలు కావడం లేదు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కచోట కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆకస్మిక తనిఖీలు, విజిలెన్స్ దాడులు గానీ జరగకపోవడం విస్మయం కలిగిస్తోంది.
కిరాణా.. ఘరానా మోసాలు..
రాష్ట్రవ్యాప్తంగా పేరుమోసిన పెద్దపెద్ద సూపర్‌మార్కెట్లలో మాత్రమే జీఎస్‌టీ తగ్గింపు అమలవుతోంది. కానీ ఇక్కడ కొనేవారు ఎంత మంది ఉంటారు? కేవలం సిటీల్లో మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. మిగతావాళ్లంతా కిరాణా షాపుల్లో కొనుక్కుంటారు. కిరాణా వ్యాపారులు పాత స్టాకును పాత ధరలకే కొన్నామంటూ ధరలు తగ్గించడం లేదు.
ధరలు తగ్గించలేదా అని అడిగితే పరిమాణం పెంచామంటూ మస్కా కొడుతున్నారు. పాలు, ఆహారపదార్థాలు, నిత్యావసరాలు, ఆహార పదార్థాల్లో ఏ వస్తువుపై ఎంత జీఎస్‌టీ తగ్గిందన్న ఒక్క బోర్డు కూడా ఎక్కడా కనిపించడం లేదు. దుకాణదారులు చెప్పిందే రేటు. నిత్యావసరాలకు సంబంధించి రీటెయిల్ మార్కెట్లో జీఎస్‌టీ తగ్గింపులు అమలుకావడం లేదు. ఉదాహరణకు విజయవాడలో 250 ఎంఎల్ కూల్‌డ్రింక్ ధర గతంలో రూ.20 ఉండేది. జీఎస్‌టీ తగ్గింపుతో దీని ధర రూ.18కి తగ్గింది. ఎమ్మార్పీ రూ.18 అని ఉన్నప్పటికీ కూడా రిటైలర్లు రూ.20కే విక్రయిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13.36కి తగ్గింది. కానీ రిటైల్ మార్కెట్లో ఇంకా రూ.20కే విక్రయిస్తున్నారు. ఇలాంటివి కోకొల్లలు.
స్టేషనరీ, వస్త్రాలు, పాదరక్షలు బయట షాపుల్లో అయినా, ఆన్‌లైన్‌లో అయినా ధరలు తగ్గించడం లేదు. షాపుల వద్ద గానీ, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో గానీ పాత, కొత్త ధరల బోర్డులు కనిపించడం లేదు. ఎవరైనా అడిగితే పండుగ ఆఫర్లు అమల్లో ఉన్నాయి.. ప్రత్యేక డిస్కౌంటు ఇస్తున్నాం.. మొత్తం బిల్లుపై 5 శాతం తగ్గిస్తున్నామంటూ మాయలు చేస్తున్నారు. జీఎస్‌టీ 2.0 రాకముందు ఉన్న స్టాక్‌పై సవరించిన ఎమ్మార్పీని స్టాంపింగ్, స్టిక్కర్, ఆన్‌లైన్ ప్రింటింగ్ ద్వారా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఇవెక్కడా సక్రమంగా అమలు కావడం లేదు.
ప్రభుత్వానికీ, ప్రజలకూ నష్టమే..
సూపర్ జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రానికి ఏడాదికి రూ.8,000 కోట్లు నష్టం వస్తుందని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. ఆ మేర ప్రజలకు ఆదా అవుతుంది.. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.. వారి జీవనశైలి మెరుగుపడుతుంది.. అందుకే ఈ సంస్కరణలను ఆహ్వానిస్తున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిపించి.. ప్రధాని మోదీని సైతం రాష్ట్రానికి తీసుకొచ్చి కర్నూలు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో చూస్తే పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఎలాగూ వస్తుంది.
కానీ ముఖ్యమంత్రి ఆశించినట్టు ఆ డబ్బు ప్రజలకు మిగలడం లేదు. రిటైర్ మార్కెట్ల మాయాజాలంలోనే ఆగిపోతోంది. ప్రజలు నిత్యం వాడే టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్, సబ్బులు, తలనూనెలు, టాల్కమ్ పౌడర్, షేవింగ్ క్రీమ్‌తో పాటు, నెయ్యి, పన్నీరు, బటర్, నమ్కీన్, కెచప్, డ్రైఫ్రూట్స్, కాఫీ పౌడర్‌లను పాత ధరలకే రిటైలర్లు విక్రయిస్తున్నారు. చట్టప్రకారం ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు అందకపోయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు. జీఎస్‌టీ ప్రయోజనాలు కొనుగోలుదారులకు దక్కుతున్నాయో లేదో తెలుసుకునే వ్యవస్థలు గానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలు గానీ ఏమైనా ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదు.