అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గడ్డపై చరిత్ర ఆవిష్కృతమైంది. ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా, అనిశ్చితి నీడలో ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా జనసంద్రమైంది. రాజధానిగా ప్రకటించిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అపురూప ఘట్టం కళ్ళముందే సాక్షాత్కరించింది. తొలిసారిగా అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగడం.. రాష్ట్ర ప్రజలందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది.
రైతులే గెస్టులు.. కళ్ళలో ఆనంద బాష్పాలు!
ఈ వేడుకల్లో అసలైన హైలైట్ ఎవరంటే.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు. ప్రభుత్వం వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది. తాము ప్రాణప్రదంగా భావించిన భూముల్లో జాతీయ పతాకం రెపరెపలాడటం చూసి రైతులు భావోద్వేగానికి గురయ్యారు. వేలాది మంది రైతుల హర్షధ్వానాల మధ్య గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండాను ఆవిష్కరించడం, అమరావతి గగనతలం జై ఆంధ్ర నినాదాలతో మార్మోగడం ఒక అద్భుత దృశ్యం.

ఈ చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమరావతి నిర్మాణంపై తమకున్న పట్టుదలను ఈ వేదిక ద్వారా వారు మరోసారి చాటిచెప్పారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న వేళ.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అమరావతి భవిష్యత్తుపై ధీమా కనిపించింది. మంత్రులు లోకేష్, అచ్చెనాయుడు, నారాయణ వంటి కీలక నేతల సమక్షంలో హైకోర్టు సమీపంలోని విశాల మైదానం విద్యార్థుల కేరింతలతో హోరెత్తిపోయింది.
ఈ గణతంత్ర వేడుకలు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అమరావతి గడ్డపై మళ్ళీ పురుడుపోసుకున్న ఆంధ్రుల ఆత్మగౌరవ గర్జన. ఇన్నాళ్లూ రాజధానిపై ఉన్న సందిగ్ధత మేఘాలన్నీ ఈ ఒక్క దెబ్బకు చెల్లాచెదురయ్యాయి. మరోవైపు, అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతుండటం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. మొత్తానికి, ఈ గణతంత్ర వేడుకలతో అమరావతి మళ్ళీ అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తన ప్రస్థానాన్ని వేగవంతం చేసింది.